రౌడీ షీటర్లు పరివర్తన చెందకపోతే పిడిఆక్ట్ అమలు చేస్తాం సీఐ నిరంజన్ రెడ్డి

రౌడీ షీటర్లు పరివర్తన చెందకపోతే పిడిఆక్ట్ అమలు చేస్తాం సీఐ నిరంజన్ రెడ్డి

 

*రౌడీషీటర్లు పరివర్తన చెందకపోతే పీడీ యాక్ట్ లను అమలు చేస్తాం* 

*రౌడీషీటర్ల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతోంది*


*కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి* 

చురకలు ప్రతి నిధి

కరీంనగర్, మే, 16IMG-20250516-WA0025
గతంలో వివిధ రకాల నేరాలకు పాల్పడి పోలీసు రికార్డుల్లో హిస్టరీ షీటర్లుగా కొనసాగుతున్న నేరచరితులు సత్ప్రవర్తనతో మెదలాలని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు. పరివర్తన చెందకుండా అదే పాత పద్ధతులను అనుసరిస్తూ వివిధ రకాల  నేరాల్లో భాగస్వాములు అయినట్లయితే  పిడి యాక్ట్ లను కూడా అమలు చేసి సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, రూరల్ ఏసిపి శుభం ప్రకాష్ నగ్రాలా ఆదేశాల మేరకు కరీంనగర్ రూరల్ సర్కిల్ పరిధిలోని రౌడీ షీటర్లకు శుక్రవారం నాడు సిఐ ఏ నిరంజన్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షణికావేశాలకు లోనై అనాలోచిత విధానంతో గతంలో వివిధ రకాల నేరాలకు పాల్పడిన హిస్టరీ షీటర్లు సత్ప్రవర్తనతో మెదిలినట్లయితే వారి పేర్లను పోలీసు రికార్డుల నుండి తొలగిస్తామన్నారు. రౌడీషీటర్లు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకుని తమపై ఆధారపడిన కుటుంబాలను పోషించేందుకు జీవనోపాధి కోసం మార్గాలను అన్వేషించాలని తెలిపారు. నేరస్తులు సత్ప్రవర్తన చెందకపోయినట్లయితే వారితో స్నేహం చేసేందుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడమే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వారిని అసహ్యించుకుంటూ బహిష్కృతులను చేస్తారని పేర్కొన్నారు. గతంలో నేరాలకు పాల్పడి గత ఐదు సంవత్సరాల నుండి ఏలాంటి నేరాల్లో భాగస్వాములు కాకుండా ఉండటమే కాకుండా అనారోగ్యం, సత్ప్రవర్తనతో ఉన్న వారి పేర్లను పోలీసు రికార్డుల నుండి తొలగించేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరచరితులు మారాలని సూచించారు. పాత నేరస్తులు మారక పోయినట్లయితే వారి ప్రభావం వారి పిల్లలపై పడుతుందనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. హిస్టరీ సీటర్లు మారకపోయినట్లేయితే తమ పిల్లలతో స్నేహం చేసేందుకు తోటి పిల్లలు ముందుకు రాకపోవడమే కాకుండా వివాహాది శుభకార్యాలకు కూడా ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా కొనసాగుతోందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం రేయింబవళ్ళు శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని, ప్రజలు ఇదేవిధంగా తమ వంతు సహకారాన్ని కొనసాగిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి తో పాటుగా 25 మంది హిస్టరీ షీటర్లు పాల్గొన్నారు

Tags: