భార్య హత్యాకేసులో భర్త అరెస్ట్
భార్య హత్య కేసులో భర్త అరెస్టు.
కేసును చేధించిన పోలీసులు.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 3: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ఆవుదుర్తి మమత హత్య కేసులో నిందితుడైన భర్త మహేందర్ ను శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడైన మహేందర్ కు మృతురాలు మమత కు దాదాపు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది, కానీ వారికి ఇప్పటి వరకు సంతానం కలుగలేదని, సంతానం మరియు కుటుంబ ఆర్థిక విషయంలో గత కొన్ని రోజుల నుండి మృతురాలికి మరియు నిందితునికి గొడవలు జరుగుతున్నాయి. సంతానం కలుగనందున నిందితుడైన మహేందర్ మద్యం త్రాగుడుకు బానిసై, అప్పులు అయ్యాయని, ప్రతి రోజు త్రాగి వచ్చి మృతురాలిని పెళ్లి సమయం లో కట్నం తక్కువ ఇచ్చారని వేధించేవాడని, నిందితుడైన మహేందర్ తో పాటు కుటుంబ సభ్యులు అయిన ఆవుదూర్తి వజ్రవ్వ, తండ్రి ఆవుదూర్తి లక్ష్మణ్, తమ్ముళ్లు ఆవుదూర్తి అనిల్ ఆవుదూర్తి వెంకటేష్ లు కూడ మృతురాలితో పెళ్లి సమయంలో కట్నం తక్కువ తెచ్చావని, పిల్లలు కూడ కనలేదని వేధించేవారన్నారు. నిందితుడు ఏ పని చేయక పోవడం వలన ఆర్థిక భారం ఎక్కువ కావడంతో మృతురాలు కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్ లో ఉద్యోగం చేసేదని, ఆ డబ్బులను కూడా నిందితుడే తీసుకునేవాడని,ఈ విషయం లో గత 20 రోజుల క్రితం మల్లాపూర్ గ్రామం, గంగాధర మండలంలో పంచాయతీ కూడా జరుగగా, ఆ పంచాయతీలో మృతురాలిని బాగా చూసుకుంటా అని చెప్పి నిందితుడు కరీంనగర్ లోని తన కిరాయి ఇంటికి తీసుకొని వెళ్లాడని తెలిపారు. నిందితుడైన మహేందర్ తన అప్పులు తీర్చేందుకు మృతురాలి మేడలో గల బంగారు పుస్తెల త్రాడు ను ఇవ్వమని అడుగగా, మృతురాలు పుస్తెల త్రాడు తన తల్లి పెట్టారని, ఇవ్వనని తెలుపడం, నిందితుడైన మహేందర్ మృతురాలిని చంపితేనే పుస్తెల తాడు తీసుకోవచ్చని పథకం వేసి, మృతురాలిని తేదీ 26-04-2025 రోజున వేములవాడ, నల్లగొండ దైవ దర్శనాలకు వెళ్ళుదామని నమ్మించి దైవ దర్శనాల అనంతరం కొడిమ్యాలలోని తన ఇంటికి తీసుకొని వచ్చి, మృతురాలిని నైలాన్ త్రాడు తో మెడ చుట్టూ బిగించి, చంపి, మృతురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించేందుకు నైలాన్ త్రాడును ఇంటి స్లాబ్ కు గల ఇనుప హుక్ కు కట్టి, మృతురాలి మెడలోని పుస్తెల త్రాడు తీసుకొని వెళ్లి, ముత్తుట్ ఫైనాన్స్ గంగాధర నందు గోల్డ్ లోన్ తీసుకొని, అట్టి డబ్బులతో తన అప్పులు తీర్చాడు. నిందితుడైన మహేందర్ పోలీస్ కేసు ఆయిన విషయం తెలిసి పారిపోదామాని తన మోటార్ సైకిల్ పై పారిపోతుండగా, చెప్యాల ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. శనివారం నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.