ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు సీఐ నిరంజన్ రెడ్డి
*ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు*
*కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి*
చురకలు విలేఖరి
కరీంనగర్, మే, 13
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి అన్నారు
మంగళవారం నాడు కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి కొత్తపల్లి ఎస్ఐ ఎస్ సామామూర్తి లు *ఇసుక అక్రమ రవాణా- చట్టపరమైన చర్యలు* అంశంపై ఎలగందల్ గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి ఉన్న రీచ్, క్వారీల నుండి ఇళ్ళు,ఇతరత్రా నిర్మాణాలకు ఇసుక ను కొనుగోలు చేయాలని సూచించారు. మానేరు పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా తరలించ బడుతున్న ఇసుకను కొనుగోలు చేయవద్దని చెప్పారు. అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారికి సంబంధించిన వివరాలను గత 10 సంవత్సరాల క్రితం నుండి పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వారి నుండి కొనుగోలు చేసి ఇల్లు నిర్మిస్తున్న యజమానులు, బిల్డర్లపై కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వం కోట్లాది రూపాయలను నష్టపోతున్నదని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, భవిష్యత్తు తరాలకు తాగునీరు లభించని దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడటం సరైనది కాదని సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు నమోదు అయినట్లయితే ట్రాక్టర్లు, టిప్పర్లు లారీల లాంటి వాహనాలు సీజ్ కావడంతో పాటు యజమానులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి సంవత్సరాల తరబడి కేసులపై తిరుగుతూ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటారనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వారి పిల్లలపై కేసుల ప్రభావం పడుతుందని, ఈ ప్రభావంతో తమ పిల్లలు చెడు నడత నడిచే ప్రమాదం ఉందని ఇసుక అక్రమ రవాణాదారులు గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటుగా గతంలో కేసులు నమోదైన యజమానులు, అనుమానితులు,గ్రామస్థులు దాదాపు 100 మంది పాల్గొన్నారు