జీవన్ రెడ్డి పై ఉన్నా ప్రేమ బిజెపి కార్యకర్తల పై లేదా

జీవన్ రెడ్డి పై ఉన్నా ప్రేమ బిజెపి కార్యకర్తల పై లేదా

జీవన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ బిజెపి కార్యకర్తలపై లేదా..?

ఎంపీ అరవింద్ ఒంటెద్దు పోకడలు మానుకోవాలి.

ఎంపీపై జగిత్యాల బిజెపి సీనియర్ నేతల ధ్వజం.

జగిత్యాల, జనవరి 24: 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో పని చేసిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించడాన్ని జగిత్యాల బిజెపి సీనియర్ నేతలు తీవ్రంగా ఖండించారు. శనివారం బిజెపి సీనియర్ నేతలు సీపెళ్లి రవీందర్, అంకార్ సుధాకర్, బాసెట్టి ప్రభాకర్, వెంకట్రాజం, రత్నాకర్ రెడ్డి, ఎర్ర శ్రీనివాస్,నవ్వోతు  సురేష్, మహేందర్ తదితరులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసిన ధర్మపురి అరవింద్ గెలుపు కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన బిజెపి సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతూ పరాయి పార్టీ నాయకుల పై ఎంపీ సానుభూతి ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల జిల్లాలో పార్టీని ఎంతవరకు బలోపేతం చేశాడో చెప్పాలని నిలదీశారు. గత 40 సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని  జగిత్యాలలో ప్రాణాలకు తెగించి పనిచేసిన అనేకమంది సీనియర్ నాయకులను, కార్యకర్తలను పార్టీకి దూరం చేసి ఎలాంటి ప్రజాదరణ లేని నాయకులను వెంటేసుకొని అడపాదడపా  జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడమే తప్పా పార్టీ బలోపేతం కోసం అరవింద్ చేసిందేమీ లేదన్నారు. ఎంపిగా ఉన్న ధర్మపురి అరవింద్ గత మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఒక్కసారి కూడా జగిత్యాలలో అడుగుపెట్టలేదని, కార్యకర్తలమంతా కృషిచేసి పట్టణంలో  13వేల పై చిలుకు ఓట్లను సాధించామని తెలిపారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసిన భోగ శ్రావణి కోసం ఎంపీ తో పాటు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం ప్రచారం నిర్వహించినప్పటికీ జగిత్యాల పట్టణంలో కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా బిజెపి ఇన్చార్జి భోగ శ్రావణి హైదరాబాదు కే పరిమితం కావడం, ఎంపీ అరవింద్ జగిత్యాలముఖం కూడా చూడకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారన్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కనీసం కార్యకర్తలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న సీనియర్ పార్టీ కార్యకర్తలను కాదని ప్రజాదరణ లేని తమ అనుయాయులకు బీ ఫాం లు కట్టపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల మున్సిపాలిటీలో అన్ని క్షేత్రాలను సమన్వయపరిచి, గెలుపు గుర్రాలకే పార్టీ టికెట్లు ఇచ్చి నాయకులంతా కష్టపడితే కనీసం 15 కౌన్సిలర్ సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికైనా ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ జిల్లా  అధ్యక్షుడు మోర పెళ్లి సత్యనారాయణ రావు, భోగ శ్రావణి లు తమ ఒంటెద్దు పోకడలను మానుకోవాలని లేనట్లయితే రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం జగిత్యాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి పార్టీని ప్రక్షాళన చేయాలని కోరారు.IMG-20260124-WA0200

Tags: