డిజిటల్ వేదిక పై శరత్ కుమార్ మేధో విలాసం

డిజిటల్ వేదిక పై శరత్ కుమార్ మేధో విలాసం

సంప్రదాయం + సాంకేతికత = అద్భుత అవధానం: డిజిటల్ వేదికపై శరత్ కుమార్ మేధో విలాసం
........... ...................................

​ధర్మపురి పాండిత్య వైభవం: అవధాన ప్రక్రియలో నూతన శకం - వొజ్ఝల శరత్ కుమార్ సాహిత్య ప్రస్థానం
.........................................

​రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494

..................................

​తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన ధర్మపురి క్షేత్రం అనాదిగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, శాస్త్రీయ సంపదలకు నిలయంగా భాసిల్లుతోంది. దక్షిణ భారతదేశం లోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం, కేవలం భక్తి పరంపరలకే కాక వేద వేదాంగాలు, శాస్త్రాగమాలు, సాహిత్య కళలకు పుట్టినిల్లుగా నిలిచింది. క్రీస్తుశకం 9వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం విద్యాభ్యాసానికి, విశేష వేదాధ్యయనాలకు కేంద్రంగా విలసిల్లిందనడానికి ఇక్కడి శాసనాధారాలు, స్థానిక వంశావళులు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కాళేశ్వరం, వేములవాడ, బాసర వంటి ప్రసిద్ధ క్షేత్రాల సరసన ధర్మపురిని కూడా చేర్చి, పండితులు దీనిని “త్రిభుజ తపోభూమి”గా అభివర్ణించడం ఈ నేల యొక్క విశిష్టతను చాటిచెబుతోంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువుదీరిన ఈ పుణ్యధామంలో అర్చక సంప్రదాయాలు, యక్షగాన ప్రదర్శనలు, హరికథా కాలక్షేపాలు ఒకదానితో ఒకటి మిళితమై ఒక అద్భుతమైన సాంస్కృతిక సమన్వయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. తరతరాలుగా ఇక్కడ కొనసాగుతున్న విద్యా పరంపరలో సంస్కృతం, తెలుగు, ప్రాకృత భాషల్లో నిష్ణాతులైన పండితులు ధర్మపురిని ఒక “విద్యా క్షేత్రం”గా తీర్చిదిద్దారు. కాలక్రమేణా ఆధునిక విద్యా వ్యవస్థలు ప్రవేశించినప్పటికీ, సంప్రదాయ విద్యా మూలాలను, ఆ ప్రాచీన పాండిత్య గరిమను కాపాడుకుంటూ రావడం ఈ క్షేత్రానికున్న ప్రత్యేక గౌరవం. 

ఈ మహోన్నత పాండిత్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, ఆధునిక కాలంలో ధర్మపురి గడ్డపై ఉద్భవించిన అద్భుత ప్రతిభావంతుడు డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్ తన అనన్య సామాన్యమైన ప్రతిభతో సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో సమానమైన పట్టు సాధించి “త్రిభాషా కవి”గా గుర్తింపు పొందారు. ప్రాచీన ఛందస్సాహిత్యంపై దృఢమైన పట్టు కలిగి ఉంటూనే, ఆధునిక భావ వ్యక్తీకరణలో తనదైన ముద్ర వేయడం డాక్టర్ శరత్ కుమార్ ప్రత్యేకత. ఆయన రచించిన శతకాలు సాహిత్య లోకంలో విశేష ప్రశంసలు అందుకోవడమే కాకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనను ఒక శక్తివంతమైన కవిగా నిలబెట్టాయి. భక్తి, నైతికత, సామాజిక స్పృహ కలగలిసిన ఆయన కవిత్వం పండిత పామరులను అలరిస్తోంది.

​తెలుగు సాహిత్య ప్రక్రియల్లో అత్యంత కఠినమైనది, మేధోపరమైనది అయిన ‘అవధానం’లో డాక్టర్ శరత్ కుమార్ ప్రవేశించడం ధర్మపురి సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి పోతుంది. శ్రీ నారాయణీ అవధాన వేదిక ద్వారా నిర్వహించబడిన డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్  ప్రథమ అష్టావధానం అటు సంప్రదాయాన్ని, ఇటు ఆధునిక సాంకేతికతను మేళవించి సాహిత్య లోకానికి కొత్త వెలుగును పంచింది. ఈ కార్యక్రమానికి సంచాలకులుగా గణపతి అశోక్ శర్మ వ్యవహరించగా, ముఖ్య అతిథిగా ముద్దు రాజయ్య వ్యవహరించారు. విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి సభా నిర్వహణ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా చేపట్టి కార్యక్రమ జయప్రదానికి తోడ్పడ్డారు. జూమ్ యాప్ వంటి డిజిటల్ మాధ్యమం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడిన ఈ అవధానంలో పృచ్ఛకులుగా ఉద్దండ పండితులు పాల్గొని అవధాని మేధస్సుకు పదును పెట్టారు. నిషిద్ధాక్షరిలో మాచవోలు శ్రీధర్ రావు సంధించిన అక్షర అడ్డంకులను శరత్ కుమార్ చాకచక్యంగా అధిగమించగా, దత్తపదిలో చంద్రశేఖర్ శర్మ ఇచ్చిన క్లిష్ట పదాలను ఛందస్సులో ఇముడ్చుతూ అద్భుతమైన పద్య రచన చేశారు. సమస్య పూరణలో ఈమని మల్లికార్జున రావు విసిరిన వైచిత్రిని సమయ స్ఫూర్తితో పూరించి సభికులను మంత్రముగ్ధులను చేశారు. వర్ణనలో పి.యల్. నాగేశ్వర రావు కోరిన అంశాలను అత్యంత రమణీయంగా చిత్రించగా, న్యస్తాక్షరిలో కౌండిన్య నండూరి వేంకటేశ్వర రాజు సూచనల మేరకు అక్షర విన్యాసాన్ని ప్రదర్శించి తన ధారణా శక్తిని చాటుకున్నారు. మాల్యాల సోమేశ్వర రావు  కోరిన ఆశు కవిత్వంలో ధారాశుద్ధిని, విద్వాన్ బైరపనేని పోతురాజు చౌదరి  నిర్వహించిన పురాణ పఠనంలో పాండిత్యాన్ని ప్రకటిస్తూ అవధాని సాగించిన ప్రయాణం తొలి సారి అయినా అది అద్వితీయం. వీటన్నింటి మధ్య దుర్గి శ్రవణ్ కుమార శర్మ  అప్రస్తుత ప్రసంగం సభలో హాస్యపు జల్లులు కురిపిస్తూ ఆహ్లాదాన్ని నింపింది.

​ఈ అష్టావధానం కేవలం కవితా శక్తికి మాత్రమే పరిమితం కాకుండా, ఏకకాలంలో అనేక అంశాలపై దృష్టి సారించగలిగే ఏకాగ్రతను, అమోఘమైన ధారణా శక్తిని, సమయస్ఫూర్తిని, శబ్ద నైపుణ్యాన్ని ఆవిష్కరించింది. డిజిటల్ యుగంలో సంప్రదాయ కళలు అంతరించిపోతాయన్న భయాలను పటాపంచలు చేస్తూ, సాంకేతికతను సాహిత్య వ్యాప్తికి ఎలా ఉపయోగించుకోవచ్చో శరత్ కుమార్ నిరూపించారు.

ధర్మపురి పుణ్యక్షేత్ర చరిత్రలో వేద పండితులు, శాస్త్ర కోవిదులు ఎందరో ఉన్నప్పటికీ, ఆధునిక కాలంలో ఈ క్షేత్రం నుండి అవధానిగా ఎదిగిన తొలి వ్యక్తిగా డాక్టర్ వొజ్ఝల శరత్ కుమార్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించ దగినది. ఈ విజయం స్థానిక యువతకు, విద్యార్థులకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. తెలుగు భాషా సాహిత్యాలకు ప్రాభవం తగ్గుతోందన్న ఆందోళన ఉన్న తరుణంలో, శరత్ కుమార్ వంటి యువకులు అవధాన కళను భుజానికెత్తుకోవడం శుభపరిణామం. ఆయన రచనల్లో కనిపించే సాహిత్య విలువలు, సామాజిక సందేశాలు నేటి తరం యువతకు దిక్సూచిగా మారుతున్నాయి. ప్రాచీన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆధునిక పోకడలను ఆహ్వానించే ఆయన దృక్పథం సాహిత్య రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. 

సంప్రదాయం మరియు ఆధునికతల ఈ అరుదైన సంగమం ధర్మపురి క్షేత్రానికి నూతన శోభను చేకూరుస్తోంది. వేదాల హోరు, గోదావరి జలాల జోరుతో పునీతమైన ఈ నేల, ఇప్పుడు అవధాన పద్యాల హోయలుతో పులకించి పోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచ పటంలో నిలబెట్టడానికి సంకల్పం, సాధన ఉంటే సరిపోతుందని ఈ యువ అవధాని నిరూపించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని గొప్ప సాహిత్య విజయాలు సాధించి, తెలుగు భాషా కీర్తిని దశదిశలా వ్యాపింప జేయాలని, ఆయన స్ఫూర్తితో మరిన్ని ప్రతిభావంతమైన మస్తిష్కాలు ధర్మపురి నేల నుండి ఉద్భవించాలని ఆశిద్దాం. పాతను గౌరవిస్తూ కొత్తను ఆహ్వానించే ఈ సాహిత్య ప్రయాణం నిరంతరాయంగా సాగి, తెలుగు సాహిత్య వైభవం కలకాలం వర్ధిల్లాలి.

చంపక మాల...
సకల కవిత్వ తత్త్వముల సారము గన్న శరత్ కుమారుడున్, 
ప్రకటిత డిజిటల్ తెరల పై నవధానము జేసె వింతగా, 
సుకవిగ ధర్మపురి క్షేత్రము శోభను పెంచెను పద్య విద్దెతో
వికసిత కీర్తి తోడ నిక విశ్వము మెచ్చగ సాగు నెప్పుడున్!
......................IMG-20260405-WA0020

Tags: