కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత.... గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి

కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత.... గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి

కరీంనగర్ లో రాజకీయ ఉద్రిక్తత

బండి సంజయ్ పై పాడి కౌశిక్ తీవ్రవ్యాఖ్యలు

గంగుల క్యాంప్ ఆఫీస్ పై బీజేపీ దాడి

కౌశిక్ రెడ్డి కారు ధ్వంసం.. రంగంలోకి పోలీసులు


చురకలు కరీంనగర్ బ్యూరో: 

కరీంనగర్లో రాజకీయ యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.


బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్దకు భారీగా చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కరీంనగర్ పట్టణంలో అదనపు సిబ్బందితో నిఘా పెంచారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు, దానికి నిరసనగా బీజేపీ శ్రేణులు చేసిన దాడితో జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గంగుల ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు పాడి కౌశిక్ రెడ్డి రాగా.. బీజేపీ శ్రేణులు ఆ కార్యాలయంపై దాడి చేశారు. లోపల కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం కొనసాగుతుండగానే.. బీజేపీ కార్యకర్తలు కార్యాలయంపై దాడిచేశారు. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


"బండి సంజయ్ కు డ్రగ్స్ అలవాటు ఉంది"

కరీంనగర్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్రమంత్రి బండి సంజయ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తంబాకులో డ్రగ్స్ కలిపి తినడం వల్లే బండి సంజయ్ కు బట్టతల వచ్చిందని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తమకు కూడా చేతనవుతుందని, బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. గతంలో ఆయన తన భార్య పుస్తెల్ని అమ్మి ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పారన్నారు. ఎన్నికల్లో బండిసంజయ్ పంచినద అవినీతి డబ్బా లేక రేవంత్ పంపిన డబ్బా అని ప్రశ్నించారు. కేటీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఏ అంశం మీదనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని కౌశిక్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ టెస్టుకు కేటీఆర్ ను తాను తీసుకొస్తానని, ఇందుకు బండి సంజయ్ కూడా సిద్ధం కావాలని సవాల్ చేశారు. బండి సంజయ్ కు డ్రగ్స్ అలవాటు ఉందని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో దాడులకు పాల్పడ్డారు.IMG-20260507-WA0005

Tags: