సిద్దిపేట ఆర్డీఓ ముందే బాధితులు పై హత్య యత్నం

ఆర్డీఓ ముందే బాధితులపై హత్యాప్రయత్నం!

• విచారణలోనే గొంతు నులిమి, పురుషాంగాలపై దాడి చేసిన ప్రత్యర్థులు

• ప్రేక్షక పాత్ర పోషించిన సిద్దిపేట డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ 

• వృద్ధుడైన తండ్రి, కొడుకుపై విచక్షణారహితంగా దాడి

• సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

సిద్దిపేట, మే 16:
న్యాయం జరగాల్సిన చోటే అన్యాయం రాజ్యమేలింది. భూవివాదంపై విచారణ జరుపుతున్న అధికారి ముందే ప్రత్యర్థులు రెచ్చిపోయారు. ఆర్డీఓ హాల్‌లోనే వృద్ధుడని కూడా చూడకుండా తండ్రీకొడుకులపై విచక్షణారహితంగా దాడి చేసి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన హేయమైన ఘటన సిద్దిపేట ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) కార్యాలయంలో శనివారం కలకలం రేపింది. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న అధికారి కళ్లెదుటే ఈ దారుణం జరుగుతున్నా, ఆయన దాడిని వారించకుండా మూగప్రేక్షకుడిలా ఉండిపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళ్తే...
సిద్దిపేట పట్టణ శివారులోని సర్వే నెంబర్ 1440 లో గల 1-04 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి పంపకాల్లో భాగంగా సిద్దిపేట నివాసి అయిన నాయకం మల్లయ్యకు దక్కింది. 1993 నుంచి అన్ని రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ భూమి మల్లయ్య పేరిటే నమోదై ఉంది. 

అయితే, ఇటీవల మల్లయ్య సోదరుడైన లక్ష్మణ్ తప్పుడు ఆరోపణలతో ఈ భూమిపై ఆర్డీఓ ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఆర్డీఓ కార్యాలయం నుంచి నోటీసులు రావడంతో, శనివారం మల్లయ్య తన కుమారుడైన నాయకం ప్రసాద్‌తో కలిసి విచారణకు హాజరయ్యారు.

కోర్టు హాల్‌లోనే గొంతు నులిమి...
ఆర్డీఓ సమక్షంలో ప్రసాద్ తన వాదనలు వినిపిస్తుండగా, అక్కడే ఉన్న వారి బాబాయ్‌లు శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలు ఒక్కసారిగా తండ్రీకొడుకులపై పడి విచక్షణారహితంగా దాడికి దిగారు. "వీడిని చంపితేనే మనకు ఈ భూమి దక్కుతుంది, ప్రాణాలతో ఉంచొద్దు" అని కేకలు వేస్తూ ప్రసాద్ గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగక కార్యాలయం ఆవరణలోకి లాక్కొచ్చి మరీ దాడి చేశారు. ఒకరు ప్రసాద్ పురుషాంగాలపై బలంగా కొట్టగా, మరొకరు గొంతు గట్టిగా నొక్కారు. వృద్ధుడైన తండ్రి మల్లయ్యపై కూడా నిందితులు దాడికి తెగబడ్డారు.

అధికారి ఎందుకు మౌనంగా ఉన్నారు?
శాంతిభద్రతలను కాపాడాల్సిన, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న ఆర్డీఓ కళ్ల ముందే ఈ ఘోరం జరుగుతున్నా ఆయన మౌనం వహించడంపై బాధితులు, ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన చాంబర్‌లోనే ఓ వృద్ధుడిపై, అతని కొడుకుపై హత్యాప్రయత్నం జరుగుతుంటే ఆర్డీఓ ఎందుకు అడ్డుకోలేదు? కనీసం సిబ్బందిని పిలిచి దాడిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆయన మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

న్యాయం కోసం పోలీసుల ఆశ్రయం:

భూవివాదం సాకుతో తనపై, తన వృద్ధ తండ్రిపై ఆర్డీఓ ముందే హత్యాప్రయత్నానికి ఒడిగట్టి, ప్రాణాపాయ ముప్పు తలపెట్టిన శ్రీనివాస్, లక్ష్మణ్, సత్యనారాయణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితుడు నాయకం ప్రసాద్ సిద్దిపేట వన్ టౌన్ సిఐ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tags: