27 నుండి పోలింగ్ కేంద్రాల పరిధిలో వార్డు, గ్రామ సభలు
*ఈ నెల 27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు/వార్డుసభలు*
*అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి*
*జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్*
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, 01.10.2026ను అర్హత తేదీగా పరిగణిస్తూ చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR), 2026లో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు/వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామ పంచాయతీ భవనాల్లో గ్రామసభలు, పట్టణ ప్రాంతాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో వార్డుసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభల్లో సంబంధిత బూత్ స్థాయి అధికారులు (BLOలు), ఎన్నికల పాఠశాల (చునావ్ పాఠశాల) సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
గ్రామసభలు/వార్డుసభల్లో ముసాయిదా ఓటరు జాబితాలో నమోదైన ఓటర్ల పేర్లను బీఎల్‌ఓలు అందరికీ వినిపించే విధంగా చదివి వినిపిస్తారని తెలిపారు. జాబితాలో పేరు నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన భారతీయ పౌరులను గుర్తిస్తారని పేర్కొన్నారు.
2026 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకునే యువత తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు నిర్ణీత డిక్లరేషన్, అవసరమైన ధ్రువపత్రాలతో ఫారం-6 సమర్పించాలని సూచించారు.
ముసాయిదా ఓటరు జాబితాలో పేరు, వయస్సు, చిరునామా, ఫొటో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటి సవరణ కోసం డిక్లరేషన్, తగిన ఆధార పత్రాలతో ఫారం-8 సమర్పించాలని తెలిపారు.
అర్హత లేకపోయినప్పటికీ ఓటరు జాబితాలో నమోదైన వ్యక్తుల వివరాలను కూడా సభలో గుర్తిస్తారని పేర్కొన్నారు. అలాంటి నమోదుపై అభ్యంతరం తెలిపే వ్యక్తి అదే శాసనసభ నియోజకవర్గానికి చెందిన ఓటరై ఉండాలని, నిర్ణీత డిక్లరేషన్‌తో ఫారం-7 సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, ధ్రువీకరణకు సంబంధించిన గడువు, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన అవసరమైన పత్రాలు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన ఇతర అంశాలపై సభల్లో అవగాహన కల్పిస్తారని తెలిపారు.
జిల్లాలోని అర్హులైన పౌరులు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండనున్న యువత ఈ గ్రామసభలు/వార్డుసభలకు హాజరై తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని కలెక్టర్ కోరారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, సవరణ లేదా అభ్యంతరాలకు సంబంధించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామసభలు/వార్డుసభలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు (EROలు), సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROలు), బీఎల్‌ఓలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సభల నిర్వహణకు సంబంధించిన కార్యవివరణను నమోదు చేయడంతోపాటు ఫొటోలను తీసి బీఎల్‌ఓ రిజిస్టర్‌లో భద్రపరచాలని సూచించారు.


