జాతీయ వేదిక పై జగిత్యాల వైద్యులకు గర్వకారణం
జాతీయ వేదికపై జగిత్యాల వైద్యులకు గర్వకారణం
ఐఎంఏ జగిత్యాల శాఖకు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డు
(కాలగిరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్)
జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శాఖకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. వైద్య సేవలు, సామాజిక బాధ్యత, ప్రజారోగ్య పరిరక్షణలో చూపిన అసాధారణ సేవలకు గాను ఐఎంఏ జగిత్యాల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డిని జాతీయ స్థాయి ఉత్తమ కార్యదర్శి అవార్డుతో సత్కరించారు.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో శనివారం ఘనంగా నిర్వహించిన ఐఎంఏ జాతీయ మహాసభలో, ఐఎంఏ జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం జగిత్యాల వైద్య వర్గానికి గర్వకారణంగా మారింది.
ఈ విషయాన్ని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గుడూరి హేమంత్ వెల్లడించారు. గత ఏడాది కాలంగా ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి అత్యంత చురుకుగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సభ్యులందరినీ సమన్వయం చేసుకుని అనేక ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని ఆయన ప్రశంసించారు.
రక్తదాన శిబిరాలు, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, రక్తహీనత నివారణ ఉద్యమాలు, ఉచిత వైద్య శిబిరాలు, వైద్యుల కోసం శాస్త్రీయ సదస్సులు, ప్రజలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహించడమే ఈ జాతీయ గుర్తింపుకు ప్రధాన కారణమని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఐఎంఏ జగిత్యాల శాఖ పోషించిన కీలక పాత్రను ఐఎంఏ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది.
ఈ సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్‌కు, ఐఎంఏ జగిత్యాల శాఖ సభ్యులకు, మీడియా ప్రతినిధులకు, అలాగే ఈ సేవా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఐఎంఏ జగిత్యాల శాఖ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ జాతీయ స్థాయి పురస్కారం జగిత్యాల ఐఎంఏ సేవలకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుందని, భవిష్యత్తులో కూడా వైద్యుల సంక్షేమం, ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని శాఖ నాయకత్వం స్పష్టం చేసింది.
జాతీయ స్థాయిలో జగిత్యాల వైద్యుల ప్రతిభకు దక్కిన ఈ గుర్తింపు… జిల్లాకే గర్వకారణం.

