జీవో 252 సవరణకు పట్టుబడుతున్న జర్నలిస్ట్ సంఘాలు
*జీవో 252 సవరణకు పట్టుపడుతున్న జర్నలిస్టు సంఘాలు*
*-ఐక్య కార్యాచరణకు రంగం సిద్దం*
*-27న రౌండ్ టేబుల్ సమావేశం*
*-జర్నలిస్టు సంఘాల అత్యవసర భేటీలో కీలక నిర్ణయాలు*
హైదరాబాద్, డిసెంబర్ 24:
రాష్ట్ర ప్రభుత్వం మీడియా అక్రెడిటేషన్ రూల్స్ ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 252 పై పలు జర్నలిస్టు సంఘాలు బుధవారం హైదరాబాద్ లో అత్యవసర సమావేశమయ్యాయి. అటు జర్నలిస్టులకు,ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరించి, తప్పుల తడకగా ఉన్న 252 జీవో సవరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆ సంఘాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
(ఏడబ్ల్యూజేఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టిజేఎస్ఎస్) ప్రతినిధులు మామిడి సోమయ్య, కే.కోటేశ్వర రావు,పులిపలుపుల ఆనందం,అనంచిన్ని వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వారు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 27న హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని, అందులో అన్ని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రభుత్వం ఇక నుంచి రెండు రకాలైన కార్డులిస్తామని నిర్ణయం తీసుకోని జర్నలిస్టులను అయోమయానికి గురిచేస్తోందని, ఈ అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డుల వల్ల వనగూరే ప్రయోజనాలను స్పష్టంగా పేర్కొనలేదని వారు తెలిపారు. అక్రెడిటేషన్ కార్డు ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా మాత్రమే ఉపయోగపడుతుందని, అయితే డెస్క్ జర్నలిస్టులు మీడియా కార్డును కేవలం సంక్షేమ పథకాలకు మాత్రమే వాడుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొనటం ఏమిటని, ఈ నిబంధన సరికాదని అన్నారు. తొలిసారిగా డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రెడిటేషన్ కార్డులివ్వనున్నారు. అది కూడా వెబ్సైట్లకు మాత్రమేనని స్పష్టం
చేశారు. ఈ కొత్త నిబంధనలతో అక్రెడిటేషన్ కార్డులకు భారీగా కోతపడుతుందని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 23 వేల అక్రెడిటేషన్ కార్డులివ్వగా, కొత్త జీవోతో అవి 10 వేలకు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కార్డు పోతే డూప్లికేట్ కార్డు తీసుకోవడానికి రూ.250 ఫీజు విధించారు. పైగా కార్డు కోల్పోతే పోలీసు ఎఫ్ఐఆర్ తప్పనిసరి చేయటం కూడా సరికాదని వారు పేర్కొన్నారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేది. ఇప్పుడు అది రద్దు చేశారని, స్టేట్, జిల్లా, మండలస్థాయిలో మాత్రమే కార్డులిస్తారని, దీనిపై ప్రభుత్వంతో చర్చించాలని వారు తెలిపారు.
గతంలో జనరల్, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని, ఇప్పుడీ కోటాను రద్దుచేసి, ఫ్రీలాన్స్ కోటాలో... అదీ కార్టూనిస్టులకే పరిమితం చేశారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని వారు కోరారు.రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కు డిగ్రీ విద్యార్హత లేదా ఐదేండ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండలస్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేశారని, కానీ వీరి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. గతంలో ఆటో డ్రైవర్లకు, సర్పంచ్ లకు, పార్టీ కార్యకర్తలకు ఇచ్చే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని వారు కోరారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50 వేల జనాభాకు ఒక అక్రెడిటేషన్ కార్డు చొప్పున ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రమే ఇస్తారని ఆ జీవోలో పేర్కొనటం సరికాదని అన్నారు.
కేబుల్ చానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారు. ఇది వరకు జిల్లా స్థాయిలో కార్డులు
ఇచ్చేవారని, ఈ కార్డులతో ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదని, కేవలం జర్నలిజం కోసం మాత్రమే వాడాలని, విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్స్ పై' అక్రెడిటేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ' అన్న పదాలు వాడరాదని, ముద్రించరాదని పేర్కొనటం సరికాదని వారన్నారు. ఈ జీవో ద్వారా చిన్న పత్రికలను చిదిమేస్తుందని, మూలిగే నక్క మీద తాటి కాయ అన్న చందంగా చిన్న పత్రికలపై కక్షసాధింపు ధోరణిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో కఠినమైన నిబంధనలతో అక్రెడిటేషన్ రూల్స్ ఫ్రేం చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి, ఈ జీవోను సవరిచాంచాలని వారు కోరారు. ఈ నెల 27 తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు జర్నలిస్టు సంఘాలు పాల్గొంటాయని,ఇందులో జీవో 252పై చర్చించి కార్యాచరణను రూపొందిస్తామని, అవసరమైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.

