శాంతి చర్చలకు సిద్ధమే మావొయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ

శాంతి చర్చలకు సిద్ధమే మావొయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ

శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధమే!

 మోదీ ప్రభుత్వం ఇందుకు సుముఖమా, కాదా, స్పష్టం చేయాలి!

ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా
ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రండి!


సీపీఐ మావొయిస్ట్ పార్టీ

చురకలు ప్రతి నిధి
హైదరాబాద్, మే, 14

భారతదేశవాసులకు, ప్రజాస్వామికవాదులకు, శాంతికాములకు, అంతర్జాతీయ విప్లవ, ప్రజాస్వామిక శక్తులకు,
 పార్టీ కేంద్రకమిటీ తరపున, ప్రజా సమస్యల పరిష్కారానికి సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలు జరపాల్సిందిగా ఏప్రిల్ 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ 2వ ప్రకటన విడుదల చేసాను, దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే అనుకూలంగా ప్రతిస్పందించడం ఆహ్వానించదగిన అంశం అని సీపీఐ మావొయిస్ట్ పార్టీ కేంద్ర కమిటి  అధికార ప్రతి నిధి అభయ్ పేర్కొన్నారు. అయితే  కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గానీ, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గానీ వచ్చిన వ్యతిరేక ప్రతిస్పందన చింతనీయంగా ఉందని, కాల్పుల విరమణ ప్రసక్తే లేదనీ, మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకుండా వారితో శాంతి చర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర హోంశాంఖ సహాయ మంత్రి  బండి సంజయ్ , ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి- రాష్ట్ర హోంమంత్రి  విజయ్ శర్మ  ప్రకటించారని అభయ్ పేర్కొన్నారు. ఎటువంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమని విజయ్ శర్మ  పదే పదే చేసిన ప్రకటనలకు భిన్నంగా కాల్పుల విరమణ ప్రకటించకుండానే మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టాలని షరతు పెట్టారని, నిజానికి మా పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమం తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లకు పరిమితమైలేదని,దేశవ్యాప్తంగా దాదాపు 16 రాష్ట్రాల్లో మా పార్టీ పని చేస్తోందని,అందువల్ల శాంతి చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి  అమిత్ షా  ప్రతిస్పందించాల్సి వుందన్నారు. ఆయన ప్రతిస్పందిస్తే ఉపయోగం ఉంటుందన్నారు.
మా పార్టీ 2002 నుంచే శాంతి చర్చల పట్ల తన వైఖరిని ప్రకటిస్తూ వచ్చిందని, 2004లో ప్రజల, ప్రజాస్వామికవాదుల డిమాండ్ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మా పార్టీతో చర్చలు జరిపినప్పటికీ వాటిని చివరి వరకు కొనసాగించకుండా చర్చల నుంచి ఏకపక్షంగా వైదొలిగిందన్నారు.ఆనాడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైందని,కానీ 2010లో దేశంలోని పౌరసమాజం, ప్రజాస్వామికవాదుల విజ్ఞప్తి మేరకు మా పార్టీ కేంద్రకమిటీ వైపు నుంచి కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిందన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతి చర్చల కోసం కృషి చేస్తున్న మా పార్టీ అధికార ప్రతినిధి కామ్రేడ్ ఆజాద్ ను కుట్రపూరితంగా పట్టుకుని హత్య చేసిందన్నారు. ఈ చర్చల ప్రక్రియలో భాగంగానే పశ్చిమ బెంగాల్ లో మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రాంజీ (మల్లోఝల కోటేశ్వర్లు)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేసాయని,శాంతి చర్చల ప్రక్రియను భగ్నం చేసాయన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు శాంతి చర్చల విషయంలో మా పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగానే ఉందని అభయ్ పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎన్నడూ అలాంటి ప్రయత్నాలు చేయలేకపోవడం చింతనీయమని, నేడు ఆపరేషన్ కగార్ లో మా పార్టీ నాయకత్వం-కేడర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసుల్ని హత్య చేయడమే కాకుండా మా పార్టీకీ, ఆదివాసుల అస్తిత్వానికి పెనుసవాలు ఎదురైన మాట వాస్తవమేఅని, కానీ ఇందువల్లనే మా పార్టీ శాంతి చర్చలపై పత్రికా ప్రకటనలు గుప్పిస్తోందని గోదీ మీడియా చేస్తున్న విష ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదని అభయ్ పేర్కొన్నారు.

బాధ్యత కలిగిన ఈ దేశవాసుల నుంచి వచ్చిన ప్రస్తావనను మేము హృదయపూర్వకంగా స్వీకరిస్తూ, వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి నేను ఒక మెసేజ్ పంపానని, దానినే వారు పత్రిక ప్రకటనగా విడుదల చేసారని, అదే మార్చి 28న (2025) విడుదలైన పత్రికా ప్రకటన అని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రత్యేకించి అనేక వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, శాంతికాముకులు సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు. వీరిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని,. ఇది సరైంది కాదని, తెలంగాణ ప్రభుత్వానికి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉండడం వలన) శాంతి చర్చల గురించి ముందు నుంచి తెలిసి వుండడం వలన శాంతి చర్చల ప్రస్తావనకు వెంటనే అనుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు. కాల్పులు విరమించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాల్సిందిగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసారని అభయ్ పేర్కొన్నారు. కాకతాళీయంగా అదే సమయంలో జరుగుతున్న భారత రాష్ట్ర సమితి (బీ.ఆర్.ఎస్.) రజతోత్సవ సభలకు హాజరైన లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అడిగిన ప్రశ్నకు జవాబుగా మావోయిస్టులతో చర్చల జరపాలని ప్రజలు నినదించారన్నారు.నేడు దేశంలో లక్షలాది మంది ప్రజలు శాంతి చర్చలను కోరుకుంటున్నారని, అంతర్జాతీయంగా పలు దేశాల్లో వివిధ మావోయిస్టు పార్టీల, ప్రజాస్వామిక సంస్థలతో పాటు కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి ప్రజలు కూడా మన దేశంలో మావోయిస్టులతో  మోదీ ప్రభుత్వం శాంతి
చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఏప్రిల్ 25న రెండవ ప్రకటన విడుదల చేసానని, శాంతి చర్చలకు నేను విడుదల చేసిన ప్రకటనలను మా పార్టీ బలహీనతగా గోదీ మీడియా విష ప్రచారం చేయడం వారి కార్పొరేట్ స్వభావాన్నే మరోసారి బహిర్గతం చేసింది తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.
ఇకపోతే, తన 2వ ప్రకటనకు ప్రతిస్పందనగా  బండి సంజయ్, విజయ్ శర్మల ప్రతిస్పందనలో మాట్లాడిన విషయాలు చింతనీయమని అభయ్ పేర్కొన్నారు.వాటిలో ఏమాత్రం వాస్తవాలు లేవని, రాజ్యహింసకు ప్రతిస్పందనగానే మా పార్టీ సాయుధ పోరాటానికి దిగిందనేది జగమెరిగిన సత్యమని,ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను, ఆదివాసీ- గైరాదివాసీ ప్రజలను వందలాది మందిని హత్య చేసిందని,చేస్తోందని, మే 7వ తేదీన కర్రెగుట్టల్లో ప్రభుత్వ సాయుధ బలగాలు పాశవికంగా నిర్వహించిన హత్యాకాండలో 22 మంది కామ్రేడ్స్ అమరులయ్యారని అభయ్ పేర్కొన్నారు. దీంతో కర్రెగుట్టల ఆపరేషన్ లో అమరులైనవారి మా కామ్రేడ్స్ సంఖ్య 26కు చేరుకుందని, ఒక వైపు చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ విధంగా హత్యాకాండ కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా దేశవాసులకు, ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేశారు. నిజానికి తుపాకులు పట్టుకునే వారిని కాల్చిచంపే అధికారాన్ని ఏ చట్టమూ ప్రభుత్వానికి ఇవ్వలేదని, ఈ వాస్తవాన్ని వారు కప్పిపెట్టేందుకు, సత్యాన్ని తలకిందులు చేసేందుకు పడరాని పాట్లు ఎందుకు పడుతున్నారో వారికే తెలియాలని, కానీ ఇందులో వారు ఎన్నడూ సఫలం కాలేరని పేర్కొన్నారు.
ఇక మేము ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసే విషయానికి వస్తే ఈ విషయంపై మా పార్టీలో ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోలేరని, మా పార్టీ ప్రజాస్వామికంగా పని చేసే పార్టీ అని, ఆపరేషన్ కగార్ లో లక్షలాది మంది పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టిముట్టి వున్న స్థితిలో మా పార్టీలో కనీసం కోర్ అయినా సమావేశమై ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోతోందని పేర్కొన్నారు. అందువల్లనే సమయావధితో కూడిన కాల్పుల విరమణను నేను ప్రతిపాదించానని, ప్రజలకు గానీ, మా పార్టీ కేడర్లకు గానీ రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చలకు రావడం అసాధ్యమని పేర్కొన్నానని, కనుక రెండు పక్షాల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తే మా పార్టీ కేంద్ర నాయకత్వం / కోర్ కలుసుకుని చర్చించుకుని,అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం లబిస్తుందని, ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్ధం చేసుకుని ఇప్పటికైనా సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి మా పార్టీతో శాంతి చర్చలకు అంగీకరించాల్సిందిగా కోరుతున్నాట్లు అభయ్ పేర్కొన్నారు.
ఈ విషయాన్ని తమ పార్టీ దండకారణ్య ఉత్తర్ - పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్ కామ్రేడ్ రూపేష్ పత్రికా ప్రకటనల ద్వారా, లెటర్స్ ద్వారా ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ కు తెలియజేసాడని,. వీటిపై ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా  బ్రీఫింగ్ చేస్తూనే ఉన్నాడని, అయినప్పటికీ ఏవిధంగానైనా తమ పార్టీని మార్చి 31, 2026 నాటికి నిర్మూలించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ ను  మోదీ  ప్రభుత్వం కొనసాగిస్తున్నదని అభయ్ పేర్కొన్నారు. అయితే ఈ లక్ష్యాన్ని అది సాధించడం అసాధ్యమని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నానని,
కాల్పులు విరమణ చేస్తే మావోయిస్టుల బలపడతారని  మోదీ  ప్రభుత్వం, గోదీ మీడియా ప్రచారం చేస్తున్నాయని, ఇది వాస్తవం కాదని,ఏ దేశంలోనయినా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే విప్లవకారులు బలపడేందుకు పునాది కల్పిస్తాయని, సమాజంలో భూమి సమస్య, ఆకలి, పేదరికం, సామాజిక ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, మహిళ సమస్య, దళిత సమస్య (అంటరానితనం), కుల సమస్య, జాతుల సమస్య తదితర మౌలిక సమస్యలున్నంత వరకూ ఈ పునాది ఉంటుందని, ప్రభుత్వ విధానాలు ప్రజలకు అనుకూలంగా ఉంటే విప్లవకారులు బలపడే అవకాశముండదని అభయ్ పేర్కొన్నారు. తమ పార్టీ ముందుకు తెచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే శాంతి చర్చలు జరపి, సమస్యలకు సరైన పరిష్కారాలను కనుగొని ఒక ఒప్పందానికి వస్తే విప్లవోద్యమ ప్రాంతాల్లో రాజ్యహింసకు, మా సాయుధ పోరాటానికి పునాది లేకుండా పోతుందని, శాంతి చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి  మోదీ  ప్రభుత్వం సముఖమా, కాదా, స్పష్టం చేయాలని,
ఈ సందర్భంగా ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా  మోదీ  ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాల్సిందిగా భారతదేశవాసులకు, విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాదులకు, శాంతికాముకులకు జర్నలిస్టులకు, సామాజిక సంస్థలకు, కార్యకర్తలకు, ఆదివాసీ శ్రేయోభిలాషులకు, అంతర్జాతీయ విప్లవ, ప్రజాస్వామిక శక్తులకు మావోయిస్టు కేంద్ర పార్టీ విజ్ఞప్తి చేస్తోందని అభయ్ పేర్కొన్నారు.IMG-20250514-WA0062

Tags: