స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో ఎం. ఐ ఎం పార్టీ సత్తా చాటాలి
స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సత్తా చాటాలి
ఎన్నికల సన్నాహక సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
కరీంనగర్, జూలై 15
రాబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంఐఎం పార్టీ అత్యధిక స్థానాలను గెలిచి సత్తా చాటాలని, ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్ వెళ్లి ఎంఐఎం పార్టీ జాతీయ కార్యాలయం దారుసలాంలో ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణ ఎంఐఎం అధ్యక్షుడు యూనుస్ నదీమ్, అధినేత అసదుద్దీన్ ఓవైసీని మర్యాదపూర్వకంగా కలిశారు. జగిత్యాల పట్టణంలో ఆదివారం ఈనెల 20న ఓఫంక్షన్ హాల్ లో నిర్వహించ తలపెట్టిన జిల్లాస్థాయి ఎంఐఎం పార్టీ ఎన్నికల సన్నాహక సభ గోడ పత్రిక (వాల్ పోస్టర్) ను, అసదుద్దీన్ ఒవైసీ ఆవిష్కరించారు. రాబోయే స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచేట్లు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా శ్రవించాలని, నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేయాలని తమ అధినేత ఓవైసీ తమకు దిశా నిర్దేశం చేసినట్లు, గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో జిల్లాస్థాయి ఎన్నికల సన్నాహక సభ నిర్వహించడంతోపాటు, పెద్ద ఎత్తున ఎంఐఎం పార్టీలో యువకులు పెద్దలు చేరబోతున్నట్లు చెప్పారు. ఎంఐఎం పార్టీని ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేసే దిశగా వివిధ పార్టీల నుండి వచ్చే నాయకులను ఎంఐఎం పార్టీలో తమ అధినేత ఆదేశాల మేరకు చేర్చుకుంటామన్నారు. ఎంఐఎం పార్టీలో చేరే వారికి ఎప్పటికీ తలుపులు తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ఎన్నికల సన్నాహక సభను ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. త్వరలో కరీంనగర్ పట్టణంతో పాటు, పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు.