పోలీస్ భార్య తిరగబడింది మా భర్తలు బానిసలు కాదు.. పోలీసులే
పోలీస్ భార్య తిరగబడింది.!
మా భర్తలు బానిసలు కాదు.. పోలీసులే.!!
సిరిసిల్ల, మామ్మునూరు, వరంగల్, గుడెపేట, డిచ్ పల్లి,
బాటలో నల్గొండ....
బెటాలియన్ ల్లో సంచలనం రేపుతున్న సస్పెండ్లు.
కలవర పెడుతున్న భార్యామణుల తిరుగుబాటు.
చురకలు ప్రత్యేక ప్రతినిధి, అక్టోబర్ 24: తెలంగాణలో పలుచోట్ల కానిస్టేబుల్ ల భార్యలు రోడ్డెక్కి తమకు న్యాయం కావాలని నినాదించారు. కానిస్టేబుల్ గా గౌరవం పొందవలసిన చోట వెట్టిచాకిరి చేస్తూ బానిసలుగా బతుకుతున్న తమ భర్తలకు అన్యాయం జరుగుతుందని డిచ్ పల్లి, మామునూరు సిరిసిల్ల వరంగల్ లాంటి నగరాల్లో బెటాలియన్ పోలీస్ సిబ్బంది భార్యలు తిరుగుబాటుకు సిద్ధం కావడంతో రాష్ట్రంలో కలకలంరేపుతుంది. చేయవలసిన డ్యూటీ కాకుండా అనవసరపు చాకిరీ చేస్తున్నారని ఇవేమీ జీవితాలంటూ మహిళలు ఆందోళన దిగారు. విలువల కోసం తాము చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా మహిళా మణులు పిలుపునిచ్చారు. దీంతో సిరిసిల్లలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే కేటీఆర్ మహిళలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అక్కడికి చేరుకున్నారు. కానిస్టేబుల్ భార్యలు తెగబడ్డతీరు ఆసక్తిగా మారింది. రోడ్డు ఎక్కిన కానిస్టేబుల్ భార్యలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో ఆందోళన జరుపుతు న్న కానిస్టేబుల్ భార్యల నుండి సమాచారం సేకరించి వారి భర్తలను 20 మందిని సస్పెండ్ చేస్తూ అధికారులు తీసుకున్న నిర్ణయం మరింత ఆగ్రహానికి దారితీస్తుంది న్యాయమైన హక్కుల కోసం, గొంతు ఎత్తి ప్రశ్నించడం చట్ట వ్యతిరేకమా అంటూ పలువురు ప్రశ్నించడం ప్రారంభించారు. కానిస్టేబుల్ లకు హక్కులు ఉండవా అని నిలదీస్తున్నారు.
నల్గొండ జిల్లాలో నారీమణుల ధర్నా.. భర్తల సస్పెన్షన్..?
తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు మొన్న ఆందోళనకు దిగారు. వరుసగా రెండు మూడు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి దీంతో అధికారులు అయోమయంలో పడ్డారు. నిరసన కార్యక్రమాలను కట్టడి చేసేందుకు పోలీస్ ఉద్యోగులపై చర్యలు ప్రారంభించారు అధికారులు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సింది పోయి ఆందోళన చేసిన వారి భర్తలను నిన్న సస్పెండ్ చేశారు. బెటాలియన్ ఉన్నతాధికారులు ధర్నాలో పాల్గొన్న వారిని గుర్తించి.. కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న 20 మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తున్నట్టు మౌఖికంగా చెప్పిన అధికారులు వారికి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే.. బెటాలియన్ కమాండెంట్ సత్యశ్రీనివాస్‌రావు స్పందించలేదు.
వరంగల్ జిల్లా మామ్మునూరులో రోడ్డెక్కిన కుటుంబాలు....
వరంగల్ జిల్లా మామ్మునూరు 4వ బేటాలియన్ కానిస్టేబుల్ కుటుంబాల ఆవేదన వ్యక్తం చేస్తూ తమ హక్కుల కోసం కుటుంబాలు రోడ్డు ఎక్కాయి.
కానిస్టేబుళ్లను వెట్టిసాకిరి చేపిస్తూ.. కనీసం సెలవులు ఇవ్వకుండా.. కుటుంబానికి దూరం చేస్తున్నారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. స్వయంగా కానిస్టేబుళ్ల భార్యలే ఆందోళనకు దిగడం హక్కుల కోసం గొంతు ఎత్తడం కొందరైతే మంచి పరిణామం, మంచి చైతన్యం అంటున్నారు.
కానిస్టేబుల్ ల భార్యలు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
నిరసన ఆపేందుకు ఆర్టీఓ ఆపీస్ నుండి మామ్మునూరు బేటాలియన్ వరకు పెద్ద ఎత్తున బందోబస్తూ ఏర్పాటుచేశారు.
రిజర్వ్డ్ పోలీసుల బాధలను అర్థం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విన్నపం చేస్తూ కానిస్టేబుల్ భార్యలు మాట్లాడుతున్నారు.
పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమే...
ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు....
బిఆర్ఎస్ అంటే సంక్షేమం కాంగ్రెస్ అంటే సంక్షోభం....
కొత్త ఉద్యోగాలు సరే ఉన్న ఉద్యోగాలకే ఎసరు...
హక్కుల గురించి ప్రశ్నిస్తే వేటు వేస్తారా...?
రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం....
కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ విమర్శించారు. 165 మంది వేయి రూపాయలు ఇరవై మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. అడ్డగోలు సాకులు చెబుతూ వారిని సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల గురించి అడుగుతే వేటు వేస్తారా అని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడేమో కానీ ఉన్న ఉద్యోగాలను రేవంత్ సర్కారు ఉడాకొడుతుందని మండిపడ్డారు. పాపపు పాలనలో ప్రతిబిడ్డ ఆగమేనని, సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్డుపైకి వస్తున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని, నాడు, నేడు ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా...?
ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పజెప్పడమేనా అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కాకుండా, ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా నడపడం నీచమంటూ మండిపడ్డారు. ప్రజా పాలనలో ప్రజల చేత ఎన్నుకోబడిన మమ్మల్ని అభివృద్ధి పనులకు దూరంగా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కూలీపనులు...వెట్టి చాకిరి...!
ఉద్యోగానికి పనికి సంబంధమే లేదు..
17వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యల ఆందోళన...
సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా...
రక్షక బటులుగా గుర్తించాలని డిమాండ్....
కర్ణాటక, తమిళనాడు విధానం చేయాలి.
అదుపులోకి తీసుకొని ఠానాకు తరలించిన పోలీసులు.....
తమ భర్తలను కూలీలుగా మార్చి వెట్టిచాకిరి చేయిస్తున్నారని 17వ బెటాలియన్ పోలీసుల కానిస్టేబుళ్ల భార్యలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన దిగారు. సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసు ఉద్యోగానికి తమ భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేదని, కూలీపని చేపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగమని వివాహం చేసుకున్నామని, తమ భర్తలకు ఎనలేని డ్యూటీలు వేసి కుటుంబంతో గడపకుండా చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. అందరూ పోలీసులకు ఒకే విధానము ఉండాలని, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న విధానాలను అమలు చేయాలని కోరారు. తమ భర్తలను రక్షకబటలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కర్ణ ప్రాంతానికి చేరుకున్న సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి వారికి నచ్చజెప్పిన వినకపోవడంతో ధర్నా చేస్తున్న మహిళలను అదుపులోకి తీసుకొని ఠానాకు తరలించారు.