రైతు రుణమాఫీ మోసం.. రైతు భరోసా బోగస్ మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల తిరగబడాలి మాజీఎమ్మెల్యే సతీష్ కుమార్

రైతు రుణమాఫీ మోసం.. రైతు భరోసా బోగస్  మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల తిరగబడాలి మాజీఎమ్మెల్యే సతీష్ కుమార్

రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి సర్కారు వెంటనే గద్దె దిగాలని, ఇచ్చిన హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. రైతు భరోసాప్రస్తుత ఖరీఫ్ కు ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ప్రకటనకు నిరసనగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పడాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీసినట్లు రుజువైందని దుయ్యబట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ సాక్షిగా రైతులకు డిసెంబర్ 9 నాటికి 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రుణ మాఫీ కోసం రూ.30వేల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. క్యాబినేట్లో రూ. 27వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు తీర్మానించి, తీరారచూస్తే కేవలం రూ.17వేల కోట్లు ఇచ్చి రైతులను దగా చేశారని ఘాటుగా విమర్శించారు. డిసెంబర్ 9 తర్వాత రైతు భరోసా క్రింద యాసంగిలో ఒక్క ఎకరానికి రూ.7500 వాన కాలానికి రూ.7500 చొప్పున సీజన్కు 9000ల కోట్లు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారని అన్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా ఇవ్వలేమని చెప్పడం రైతులను నట్టేట ముంచడమేనన్నారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని మోసం చేసి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వనందుకు ముక్కునేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇచ్చి జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామని నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆసరా ఫించన్, కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం, మహిళలకు రూ.2500 అమలు చేయాలని డిమాండ్ చేశారు. వానాకాలం రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమేనని విమర్శించారు. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని గుర్తు చేశారు. వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని ఆరోపించారు. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందని మండిపడ్డారు. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందన్నారు. ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదు. సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారని హెచ్చరించారు. ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదని జోస్యం చెప్పారు. రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు...మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ అని ప్రశ్నించారు. మీరుచెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7500 ఇచ్చేందుకు పైసలు లేవా అని మండిపడ్డారు. పచ్చి అబద్దాలు, మోసాలతో రైతులను దగా చేశావని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ దగాకోరు మాటలు నమ్మి గెలిపించిన రైతులను అరిగోస పెడుతున్నారని దుయ్యబట్టారు.రైతులతో చెలగాటమాడితే మాడి మసి అవక తప్పదన్నారు. రుణమాఫీ మోసం చాలదన్నట్లు...ఇప్పుడు రైతు భరోసాలోనూ దగా చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే.
లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని.. 
రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ ప్రభత్వాన్ని వదిలేది లేదన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక లబోదిబో మంటున్న సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు వరి ధాన్యానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా కనీసం మద్దతు ధర పెంచి ఇస్తామని చెప్పిన విధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గానికి వచ్చి ఊక దంపుడు ముచ్చట్లు మాట్లాడి, ఆచరణలో అమలు కానీ హామీలు ఇచ్చి వెళుతున్నాడే తప్ప హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది ఎంతమందికి రైతు భరోసా వచ్చిందో తెలియని దుస్థితి దాపరించిందని ఎద్దేవా చేశారు. రైతులతో చెలగట మాడితే కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసైపోతుందన్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గానికి నీళ్లు రావలసినటువంటి అవసరం ఉందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతాంగానికి విశేషంగా మేలు చేయడంతో పాటు ఎన్నో రైతు అనుకూల కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో సుమారు 450 కి పైగా చెరువులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రైతు బంధు ద్వారా రైతుకు సహాయం అందించి మిషన్ కాకతీయ ద్వారా చెరువులను నింపి కాలేశ్వరం జనాలతో ప్రాజెక్టులోకి నీరు వచ్చేట్లు చొరవ చూపించడం వల్ల వరద కాలువలోకి నీరు విడుదల చేయించడం వల్ల గత పది సంవత్సరాలు రైతుల బ్రహ్మాండమైనటువంటి పంటలను పండించి ఆనందంతో ఉన్నారని చెప్పారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కండ్లలో కన్నీళ్లు తీసుకువచ్చే పరిస్థితి వచ్చింది అన్నారు. రైతులకు రైతు భరోసా అందించడంతోపాటు వారు పండించిన పంటకు మద్దతు ధరను ఇచ్చే దానికంటే అదనంగా ఇవ్వాలని రైతు భీమా కల్పించాలని విద్యార్థులకు పెండింగ్స్ స్కాలర్షిప్ లను ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్లో తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు, రైతు సంఘాల నాయకులు, రైతులు, సతీష్ కుమార్ అభిమానులు పాల్గొన్నారు.IMG-20241020-WA0003

Tags:

Related Posts