పట్ట భద్రుల-ఉపాధ్యాయ ఎన్నికలలో అన్ని పార్టీలు బీసీలకే కేటాయించాలి.
పట్ట భద్రుల-ఉపాధ్యాయ ఎన్నికలలో అన్ని పార్టీలు బీసీలకే కేటాయించాలి.
బిసి సంక్షేమ సంఘం డిమాండ్...
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్,08
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ త్వరలో జరిగే పట్టభద్రులు-ఉపాధ్యాయ నియోజవర్గాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు బిసి అభ్యర్థులకే కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. .......గత అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు అర్థబలం, అంగ బలం అంటూ అగ్రకులాలకు కేటాయించారు. అన్ని పార్టీలు అదే పనిగా బీసీలకు అన్యాయం చేస్తూ పోతే సహించేది లేదని అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ జనాభా ప్రకారము సామాజిక వర్గానికి వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినా బీసీల వాటా బీసీలకు ఇవ్వలేదు. ఇంకా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. బి.సి.లకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు. రాజకీయ రంగంలో బి.సి ల ప్రాతినిద్యం 14శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వార తెలిసింది. బి.సి.లకు రాజకీయ రంగంలో 76 సంవత్సరాల బి.సి ల ప్రాతినిధ్యం సర్వే చేసి లెక్కించగా, 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి లకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగరంగంలో 9 శాతం, పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ఉన్నత న్యాయ స్థానాలలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిథ్యం లేదంటే చట్ట సభలలో సహా అన్నీ రంగాలలో బి.సి లకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతుంది. దీని కోసం రాజ్యాంగాన్ని సవరించాలని బి.సి.లు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు. స్వాతంత్రం వచ్చినప్పుడు బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటుల్లో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ కులాలను అణచివేస్తున్నారని విమర్శించారు. 2025 లో సేకరించబోయే జనాభా గణనలో కులాల వారిగా బీసీ జనాభా గణన చేయాలని సమావేశం కోరింది. ఎస్సీ/ఎస్టీల జనాభా ను కులాల వారిగా సేకరిస్తున్నారు. బీసీల జనాభా సేకరించడానికి అభ్యంతరాలు ఏమిటి? చట్టపరమైన, న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవు. పులులు తదితర జంతువుల లెక్కలు ఉన్నాయి. కానీ బిసి జనాభా లెక్కలు చేయాలంటే అనేక అభ్యంతరాలు చెబుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు బి.సి. జనాభా లెక్కలు సేకరించాలని 40 సంIIరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం బి.సి జనాభా లెక్కలు తీయకుండా బికించి అన్యాయం చేస్తుందని విమర్శించారు. అన్నీ రాజకీయ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి, ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మనదేశంలో పీడిత కులాలను ఇంకా అణచి వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలి, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభా ప్రకారం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని కోరారు. బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని కోరారు. ఎస్సీ /ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి. యాక్ట్ ను తీసుకురావాలని కోరారు. ప్రపంచీకరణ సరళీకృత, ఆర్థిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడం ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ /బి.సి.లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీంకోర్టు- హైకోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. కేంద్రంలో బి.సి లకు పోస్ట్ మెట్రిక్స్, స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కలలో బి.సి. కులాల వారిగా లెక్కలు సేకరించాలని కోరారు. ఈ డిమాండ్లపై జాతీయ స్థాయి ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బండపెల్లి నర్సయ్య, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

