స్కూల్ నడవకుండా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
స్కూల్ నడవకుండా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి
800 మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకారం అందించండి
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో డీజీపీనీ కలిసిన గులాం అహ్మద్.. స్కూల్ ప్రతినిధులు
కరీంనగర్, అక్టోబర్ 13:-
నగరంలోని నడిబొడ్డున కే.కే హాస్పిటల్ ఎదురుగా ఉన్న వీధిలో హుదా హై స్కూల్ ను నడవకుండా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తోపాటు స్కూల్ ప్రతినిధులు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. గత 22 సంవత్సరాల నుండి నగరంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్కూల్ ను నడుపుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు బాసటగా నిలుస్తూ, ఫీజులో ఎక్కువ శాతం వెసులుబాటు కల్పిస్తూ సేవే పరమావధిగా నడిపిస్తున్న హుదా హై స్కూల్ నడవకుండా మిన్హాజోద్ధీన్, రజియుల్లా ఖురేషి, ఆలీముల్లా ఖురేషి తో పాటు మరికొందరు కలిసి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, 800 మంది పేద విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారే ప్రమాదం ఉందని, కుట్రలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును ఆగం కానివ్వమని, 800మంది విద్యార్థుల చదువును నిరాటంకంగా కొనసాగించేందుకు ఎంఐఎం పార్టీ మద్దతు హుదా హైస్కూల్ కు ఉంటుందని అసదుద్దీన్ ఓవైసీ అభయమిచ్చారు. స్కూల్ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకున్న బిల్డింగ్ యజమాని అకస్మాత్తుగా మరణించడంతో కొందరు తాము వారసులమని బుకాయిస్తూ అట్టి బిల్డింగును ఖాళీ చేయాలని ఇందులో స్కూల్ ను నడవనివ్వమంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో వారసులు గా చలామణి అవుతున్న వారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కావద్దని ఎంఐఎం పార్టీ హుదా హైస్కూల్ కు అండగా ఉంటుందని, స్కూలుకు మద్దతుగా నిలవాలని తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ తెలిపారు. హుదా హైస్కూల్ ప్రెసిడెంట్ అహ్మద్ అబ్దుల్ అజీమ్, స్కూల్ కరస్పాండెంట్ అబ్దుల్ రబ్ ముజాహిద్ లతిఫీ, ఖాలీద్ లతిఫీ తదితరులు డిజిపిని కలిసిన వారిలో ఉన్నారు.

