కనుమరుగైన తీవ్రవాదం. తెరమరుగైన ఉద్యమం
కనుమరుగైన తీవ్రవాదం...తెరమరుగైన ఉద్యమం
.......................................................
అమర వీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా
.......................................................
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
...............................
నాటి కమ్యూనిస్టుల, రజాకార్ల కార్యకలాపాలకు అనంతర పీపుల్స్ వార్ ఉద్యమానికి
కేంద్ర బిందువై, విప్లవాల పురిటి గడ్డగా పేరెన్నిక గని, రైతు కూలీల సంఘాల స్థాపనకు అజ్ఞాత తీవ్రవాద ఉద్యమానికి ఊపిరులూది, పీపుల్స్ వార్ వ్యవస్థాపక భాగస్వామ్య నేత, మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ 'గణపతి' జన్మస్థలమైన జగిత్యాల జిల్లాలో గత దాదాపు రెండు దశాబ్దాలుగా 'వార్' కార్యకలాపాలు తెర మరుగైనాయి. పోరాటాల పురిటి గడ్డపై భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం దున్నే వాడిదే భూమి నినాదంతో ప్రారంభించి, రైతు కూలీ సంఘాల స్థాపన ద్వారా వేళ్ళూనుకుని, 1977లో జగిత్యాల జైత్ర యాత్ర పేరున కాగడాల ప్రదర్శన ద్వారా బల ప్రదర్శన గావించి, పలు సమస్యలపై పోరాటాలను నిర్వహించడం ద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకుని, తన నిరాటంక కార్యకలాపాలను విస్తరించుకున్న పీపుల్స్ వార్ కార్యకలాపాలు ఈ ప్రాంతంలో క్రమేపీ పూర్తిగా కను మరుగైనాయి. నిరంతర వ్యూహాలు, ఎత్తుగడలు, ఎత్తుకు పై ఎత్తులతో పీపుల్స్ వార్ పోలీసుల ఆధిపత్య పోరులో 'వార్' ఉద్యమ చరిత్రలో ఏనాడూ లేని విధంగా నాటి సిఎం రాజశేఖర రెడ్డి హయాంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొని జగిత్యాల జిల్లాలో ఉనికిని కోల్పోయింది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, సాయుధ పోరాటమే ధ్యేయంగా, రాష్ట్రం లోనే ప్రప్రథమంగా 1985 జూలై 23న సాయుధ కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని ధర్మపురి క్షేత్ర నడి బొడ్డున ప్రజల సంచారం మధ్యన కాల్చి చంపి, బీర్పూర్ లో వంగపెల్లి తిరుపతి రావును హతమార్చి, నాటి జగిత్యాల డీఎస్పీ వేణు గోపాల కృష్ణ, సీఐ నర్సింగ్ రావు పోలీసు ఉన్నతాధికారుల రాకను ఊహించి, 1989 సెప్టెంబర్ 13న మందు పాతరలను పేల్చి 18 మంది అమాయకుల మృతికి కారణమై పోలీసులే లక్ష్యంగా, పోలీసు వ్యవస్థకు సవాలు విసిరిన పీపుల్స్ వార్, ఎన్ కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్లు, అంతర్గత సమస్యలు, సమన్వయ రాహిత్య కారణాలుగా ఈ ప్రాంతం నుండి కాలక్రమేణ నిష్క్ర మించింది. ముఖ్యంగా కొంతకాలం పాటు అడ్డూ అదుపూ లేకుండా, ఈ ప్రాంతంలోని పలు మండలాల లోని గ్రామాలపై గట్టి పట్టు కలిగి, పలు హత్యలు, దహనాలు, దగ్గాలు, కరవు దాడులలాంటి అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడి, తమ ఆధిపత్యాన్ని చాటి చెపుతూ, పోలీసులకు పెను సవాలుగా మారిన అరికెల్ల శంకర్ అలియాస్ 'భూపతి' నేతృత్వం లోని మల్యాల దళం 1990 ఆగస్టు 19న మల్లన్నపేట వద్ద జరిగిన భారీ ఎన్ కౌంటర్లో దళ డెప్యూటి కమాండర్ మరాఠా రవి, భూపతి భార్య లక్ష్మి, విలాసాగర్ విజయలక్ష్మి, సూర్యం, భారతక్క, సంధ్య, రాజయ్య అనే ఆరుగురు దళ సభ్యులను ఏకకాలంలో పోగొట్టు కోవడం ద్వారా వార్ కార్యకలాపాలు కనుమరుగు కాగా, 2000 సెప్టెంబర్ 20న మంథని, ముత్తారం ప్రాంతంలోని దుబ్బలపాడు వద్ద పోలీసుల చేతిలో అరికెల్ల శంకర్ అలియాస్ భూపతి మృతి చెందడంతో మల్యాల దశం శకం ముగిసింది. అనంతర పరిణామాలలో అనూహ్యంగా 2002 జూలై 2వ తేదీన ధర్మపురి మండలంలోని నేరేళ్ల గ్రామ శివారులోని సంకెన బోరు గుట్టపై, కరుడు కట్టిన తీవ్రవాది, పోలీసులకు సింహ స్వప్నంగా మారిన కరీంనగర్ పశ్చిమ డివిజన్ కార్యదర్శి, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటి సభ్యురాలు న్యాలకొండ రజిత అలియాస్ 'పద్మక్క' తో బాటు లక్ష్యాన్ని ఛేదించడంలో గురి తప్పని నేర్పరిగా భావించ బడిన సాగర్, విక్రం, మానసలు పోలీసు కాల్పులలో అసువులు బాయడం వార్ కు అశని పాతమైంది. ఆ తరువాత నాటి జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అనుసరించిన కఠిన వైఖరి మూలంగా, నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొంటూ, పీపుల్స్ వార్ జగిత్యాల ఏరియా కమిటీ కార్యదర్శి గిరి రవీందర్ అలియాస్ 'జనార్ధన్' ఎదురు కాల్పుల
మృతితో ఈప్రాంతంలో 'వార్' కార్యకలాపాలు అడ్డుకట్ట పడింది.
తీవ్రవాదానికి పలువురి బలి
ప్రప్రథమంగా పీపుల్స్ వార్ చేతిలో ధర్మపురి క్షేత్రంలో కాల్చి చంపబడిన సాయుధ కానిస్టే కోమల్ రెడ్డి, బట్టపెల్లి - పోతారం మధ్య పాతరలో ప్రాణాలను కోల్పోయిన పోలీసులు శ్రీనివాస్, ప్రకాశ్, రాజయ్యలతో పాటు ధర్మపురి ప్రాంతంలో వార్ నక్సల్స్ చేతిలో హతమైన జోగినిపెల్లి వసంతరావు, కొండపల్లి జగన్నాథ రావు, పెద్దనవేని రాయమల్లు, రాగయ్య, బసవరాజు అంజయ్య, మహేశ్, ఉమాపతిరావు రామడుగు జనార్దన్రా రావు, మూల సత్తయ్య, ఫహీం, సుంకసాని జలందర్ రావు, సుద్దాల వెంకటి, పొనగంటి ప్రభాకర్, షేక్ మహబూబ్ అలీ, కొండపెల్లి వాసుదేవరావు, బొడ్డు శంకరయ్య, గొల్లపెల్లి మండలంలో కందుకూరి శంకరయ్య, మూల జగన్, పబ్బనవేని రాజ కటారి సత్యనారాయణరావు, ముదాం ఆది రెడ్డి, మరియు సారంగాపూర్ మండల వాస్తవ్యు లైన గంగాధర సుధాకర్ రెడ్డి, నలిమల మల్లయ్య, లెక్కల గంగారెడ్డి, మడిగెల మాధవ రెడ్డి, వేల దేవరావు, అన్నమనేని మనోహర్రావు, కంకణ బాలయ్య, రామడుగు నర్సింగరావు, చంద్రశేఖర్రావు, బాలె చిరంజీవి, సబ్బ నర్సయ్య, నూతులు రాఘవరెడ్డి, పడిగల మాధవరెడ్డి, ఎడమల మాధవరెడ్డి, కల్లెం వెంకటరెడ్డి, ఓల్లాల భూమయ్య తదితరులు తీవ్ర వాదుల చేతుల్లో ఆయువు తీరకమున్నే అస్తమించారు.

