వాస్తవాలు మాట్లాడితే బిఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారాలతో ఎదురు దాడి చేయడం సిగ్గుచేటు
తీగలవంతెన లైట్లకు ఆరు కోట్లు..ఇందిరా చౌక్ కు రెండున్నర కోట్లు పెట్టింది వాస్తవం కాదా?
మచ్చలేని నికార్సైన నాయకుడు సుడా చైర్మన్ పై బిఆర్ఎస్ నేతల అసత్య వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేతలు
చురకలు ప్రతినిధి కరీంనగర్, అక్టోబర్, 20
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన అబద్ధపు ప్రచారాన్ని ఖండిస్తూ నిజానిజాలను కరీంనగర్ ప్రజానీకం ముందు ఉంచాలని సంకల్పంతో, వాస్తవాలు మాట్లాడిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ చోటామోటా లీడర్లు ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు. ఆదివారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సెల్స్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్, బానోతు శ్రవణ్ నాయక్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఒకే పార్టీలో కొనసాగుతూ, కాంగ్రెస్ జెండాతో విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే సుడా చైర్మన్ పై ఊకదంపుడు ముచ్చట్లు మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలే బీఆర్ఎస్ ను పాత రేస్తారని మండిపడ్డారు. నాణ్యత లోపంతో సంవత్సరం క్రితం చేసిన పనులు, ఎక్కడికక్కడ చెడిపోతే దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత అనడం బిఆర్ఎస్ నీతిమాలినతనానికి నిదర్శనం అని అభివర్ణించారు. తీగల వంతెన పిల్లర్లకు లైట్లు అమర్చడానికి ఆరున్నర కోట్లు వెచ్చించడం దారుణమని, సంవత్సర కాలంలో కేబుల్ పిల్లర్లపై అమర్చిన డైనమిక్ లైటింగ్ సిస్టం పనిచేయకుండా పోతే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. ఇందిరా చౌక్ సుందరీకరణకు మొదటగా ఒక కోటీ ముప్పై లక్షలు ఖర్చు చేసి, అవి సరిపోవని మళ్లీ ఒకకోటీ ఇరవై లక్షలకు అంచనాను పెంచడం వీళ్ళ కాసుల కక్కుర్తికి పరాకాష్ట అని మండిపడ్డారు. హౌసింగ్ బోర్డు కూడలిలో ఏర్పాటు చేసిన బొమ్మ బోటుకు, ఎనభై లక్షలు వెచ్చించడం చూస్తే వీళ్ళ అవినీతి దాహం ఏ విధంగా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి, ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడే, నరేందర్ రెడ్డి పై అవాకులు చవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈసమావేశంలో కుర్ర పోచయ్య, వాడి వెంకట్ రెడ్డి, జీడి రమేష్, మెతుకు కాంతయ్య, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, మహాలక్ష్మి, తిరుమల, హసీనా, కూడలి దామోదర్, పాండ్రాల లింగమూర్తి, జాఫర్, హనీఫ్, యోనా తదితరులు పాల్గొన్నారు.

