మౌలానా అబుల్ కలాం అజాద్ ఆశయ సాధనే మనందరి లక్ష్యం జిల్లా మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు నయీమ్
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాల సాధనే మనందరి లక్ష్యం కావాలి
విద్య, సామాజిక న్యాయం, మత సామరస్యం, జాతీయ సమైక్యతకు ఆయన జీవితం ఆదర్శం
విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యం
– జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం చైర్మన్ ఎం.ఏ. నయీమ్
కోరుట్ల: భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్న మహనీయుడు, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (11 నవంబర్ ) ను పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఆయన ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం చైర్మన్ ఎం.ఏ. నయీమ్ పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం జాతీయ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ చైర్మన్ ఎం.ఏ. నయీమ్ ఆధ్వర్యంలో పట్టణంలోని నౌనిహాల్ ఉర్దూ మీడియం హైస్కూల్ తో సహా పలు ప్రభుత్వ ప్రైమరీ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు మెమెంటోలు అందజేశారు.ఈ సందర్బంగా నయీమ్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం, ఆయన అనుసరించిన ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్యను సమాజ అభ్యున్నతికి ప్రధాన సాధనంగా భావించిన ఆజాద్, స్వాతంత్ర్యం అనంతరం దేశ విద్యారంగానికి పటిష్టమైన పునాదులు వేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని, పేదరికం, సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించడానికి విద్యే ప్రధాన ఆయుధమని ఆయన విశ్వసించారని తెలిపారు. దేశంలో ఉన్నత విద్య, సాంకేతిక విద్య, పరిశోధన, సాంస్కృతిక అభివృద్ధికి అవసరమైన సంస్థల నిర్మాణంలో ఆజాద్ చూపిన దూరదృష్టి భారతదేశ ప్రగతికి ఎంతో దోహదపడిందన్నారు. ఆయన కృషి, సేవలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మతం, కులం, ప్రాంతం, భాష అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న మౌలానా ఆజాద్ ఆలోచనా విధానం నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ముఖ్యంగా పేద, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునేలా మార్గనిర్దేశం చేయడం, విద్యా అవకాశాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ మైనారిటీ విభాగం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. భారతదేశం భిన్న మతాలు, భాషలు, సంస్కృతుల సమ్మేళనమని, పరస్పర గౌరవం, సహనం, సోదరభావంతో ప్రజలంతా కలిసి జీవించాలన్నదే మౌలానా ఆజాద్ ఆశయమని వివరించారు. మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ సమైక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతగా గుర్తించాలన్నారు. యువతలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత, సేవాభావం పెంపొందించాలని సూచించారు. మౌలానా ఆజాద్ చూపిన మార్గంలో యువత ముందుకు సాగినప్పుడే సమానత్వం, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతాయని నయీమ్ పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు విద్యా ప్రోత్సాహం, సామాజిక సేవ, మత సామరస్యం వంటి కార్యక్రమాల ద్వారా ఆచరణలో చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వసంత గంగాధర్, 21వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షహనాజ్ రిజ్వనా, 2 వ వార్డు కౌన్సిలర్ హుమెరా వాసిద్, 17 వ వార్డు కౌన్సిలర్ సోగ్రా బీ, 18 వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రహీం, 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శిరీష విజయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్, మైనారిటీ నాయకులు రిహన్, ఫెరోజ్ యువకులు సాజిద్, సూఫియాన్, అజాన్ రజా, ముస్తాఖీమ్, అశ్రార్, ఆకిఫ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..jpg)

