మావో అగ్రనేతల ఖిల్లా జగిత్యాల జిల్లా
మావో అగ్రనేతల ఖిల్లా 'జగిత్యాల జిల్లా'
నాడు గణపతి....నేడు తిరుపతి...
ఇద్దరిది గురు శిష్యుల బంధం...
మావో కేంద్ర కమిటీ సెక్రటరీ గా దేవ్ జీ...
దేశవ్యాప్త దృష్టి జగిత్యాల జిల్లా వైపు...
చురకలు ప్రతినిధి, జగిత్యాల, సెప్టెంబర్ 10: 47ఏళ్ల క్రితం నాటి జగిత్యాల జైత్రయాత్రను మంగళవారం తలుచుకుంటున్న సమయంలో అదే రోజు మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం కొత్త పేరు ఖారారు చేసింది.అది జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ని జనరల్ సెక్రటరీ గా నియమించారు అంటూ దేశవ్యాప్త ప్రచారాన్ని మీడియా ప్రారంభించారు. తిరుపతికి వచ్చిన పగ్గాలు రావడంతో మళ్లీ కేంద్ర సర్కార్ దృష్టి జగిత్యాల వైపు మళ్లింది. ఇంతకు ముందే జగిత్యాల జిల్లా కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి సెక్రటరీ గా పనిచేశారు ఆయన దగ్గర శిష్యుడు మావో సిద్ధాంత నిపుణుడు గా మారిన తిరుపతికి పార్టీ పగ్గాలు అప్పగించారు.ఈ పదవి ఇచ్చారన్న వార్తతో జగిత్యాల జిల్లా అగ్రనేతలకు అడ్డాగా మారింది.తిరుపతి 1980 నుంచి ఆర్ ఎస్ యు
కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఎస్ ఆర్ ఆర్
కాలేజ్ పూర్వ విద్యార్థి. కోరుట్ల తిరుపతి మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి గా ఎన్నికయ్యారని ప్రచారం జరుగుతోంది .ఆయనపై కరీంనగర్ జిల్లా లో ఆర్ ఎస్ యు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.ఆ తరువాత తిరుపతి అడవి బాట పట్టారు.ఇక ఆయన విప్లవ రాజకీయాలతో పాటుగా సైనికులవిభాగంలో ఆరితేరిన అనుభవం ఉంది.ప్రపంచదేశ విప్లవ రాజకీయాలపై అవగాహన కలిగి ఉన్న తిరుపతి మాజీ దళపతి గణపతికి ప్రియ శిష్యుడు. విప్లవ పాఠాలు బోధించే తిరుపతిని…తిరుపతి సార్ అంటూ పిలిచే వారు.దళిత మాల వర్గంకు చెందిన తిరుపతి తండ్రి 1980 దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవారు. ఆర్థికంగా ఇబ్బందులు లేని కుటుంబం నుంచి విప్లవ రాజకీయాల్లోకి వెళ్లారు.1984 లో ఆయన బస్తర్ వెళ్లారు.చంద్రబాబు పై దాడి స్కెచ్ గీసిన నలుగురిలో తిరుపతి ఒక్కరు.దేశంలో అమిత్షా బలగాలు ముప్పేట దాడులు జరుపుతున్నా కూడా కేంద్ర కమిటీ కీలక సమావేశం జరగినట్టుగా సమాచారం అందింది.ఈ సమావేశంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వ బాధ్యతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కి అప్పగించినట్టుగా తెలుస్తోంది. సెంట్రల్ మిలటరీ కమిషన్ (సి యం సి) చీఫ్ గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా పని చేస్తున్న దేవ్ జీ ని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.గతంలో కూడా సెక్రటరీ పనిచేసిన నంబాల్లా కేశవరావు మిలిటరీ చీఫ్ గా పనిచేసిన వారే దేశంలోని 6 రాష్టాల్లో నుండి కేంద్ర కమిటీలో ఉన్నప్పటికీ కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యత మరోసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికే దక్కుతున్నాయి.నాటి పీపుల్స్ వార్ ఆవిర్భావం తరువాత కొండపల్లి సీతారామయ్య సీసీ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించగా ఆయనను ఆ బాధ్యతల నుండి తప్పించి ముప్పాళ లక్ష్మణ్ రావు సుదీర్ఘ కాలం పని చేశారు. 2005లో మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ (యం. సి సి) ఆవిర్భావం తరువాత కూడా ముప్పాళే ఆ బాధ్యతల్లో కొనసాగారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పుల జరిపినప్పుడు నంబళ్ల కేశవ రావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 2025 మే 21న ఛత్తీస్‌గఢ్ బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో నంబాళ్ల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగనన్న 28 మంది సహచరులు చనిపోయారు. ఆ తరువాత పార్టీ పొలిట్ బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్ కమిటీల సంయుక్త సమావేశం జరగలేదు. దీంతో పార్టీకి సీనియర్ నేత ముప్పాళ లక్ష్మణ్ రావు దిశా నిర్దేశం చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. పెద్దపల్లి వేణుగోపాల్ రావు పై మొదట్లో ప్రచారం జరిగింది అయితే తాజాగా కేంద్ర కమిటీ బాధ్యతలను తిప్పిరి తిరుపతికి అప్పగించినట్టుగా వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి తెలుగు నాయకత్వానికే పట్టం కట్టినట్టయింది.
జగిత్యాలకే జై.....
జగిత్యాలకే రెండో సారి మావోయిస్టు పార్టీ జై కొట్టింది.
ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందిన కొండపల్లి సీతారామయ్యను బాధ్యతల నుండి తప్పించిన తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతనంగా ఆవిర్భవించిన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన ముప్పాళ లక్ష్మణ్ రావు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాలి మండలం జియన్నపేటకు చెందిన నంబళ్ల కేశవరావు పార్టీ సుప్రీంగా వ్యవహరించారు. తాజాగా ఈ బాధ్యతలు అప్పగించిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన వారు. పొలిట్ బ్యూరోలో కీలక బాధ్యతలు వహించిన వారికే ఇంతకాలం సీసీ కమిటీ కార్యదర్శి బాధ్యతలు అప్పగించే వారు. ఈ సారీ మిలటరీ కమిషన్ చీఫ్ గా, పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్న తిప్పిరి తిరుపతికి ఈ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అయితే పెద్దపల్లి పట్టణానికి చెందిన మరో కీలక నేత మలోజ్జుల వేణుగోపాల్ పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ దేవుజీ వైపే ముఖ్య నాయకత్వం మొగ్గు చూపినట్టుగా తెలుస్తున్నది. పార్టీ ఆర్థిక వేత్తగా, కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేస్తున్న వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అలియాస్ సోనూ దాదా విధాన నిర్ణయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. మిలటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న ముఖ్య నేతల్లో ఒకరైన దేవ్ జీ కి ఈ బాధ్యతలు అప్పగించినట్టయితే సముచితంగా ఉంటుందని భావించినట్టుగా సమాచారం. దండకారణ్యంలో పార్టీ కార్యకలాపాల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, రెడ్ కారిడార్ ఏరియాలో చాలా భూభాగాన్ని బలగాలు కైవసం చేసుకున్నాయి. అంతేకాకుండా పార్టీ మెయిన్ లీడర్లే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్లు చేపడుతున్న క్రమంలో ఎదురు దాడులు చేయాల్సిన ఆవశ్యతకను కూడా కేంద్ర కమిటీ నాయకులు గమనించినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే అటు మిలటరీ ఆపరేషన్లు, ఇటు రాజకీయ వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న దేవ్ జీ కి బాధ్యతలు అప్పగించినట్టయితే సముచితంగా ఉంటుందని ముఖ్య నాయకత్వం యోచించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
డి కె జడ్ సి లో కూడా మార్పులు చేర్పులు జరిగితే హిడ్మా కు మరింత ఉన్నత పదవి దక్కుతుందని మావోయిస్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.