నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

IMG-20250912-WA0069నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ అరెస్టు.

వివరాలు వెల్లడించిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి.

చురకలు ప్రతినిధి, కరీంనగర్, సెప్టెంబర్ 12: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను మోసం చేసిన ప్రధాన నిందితులలో  ఒకరైన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ అనే వ్యక్తి సెప్టెంబర్ 11, 2025న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోతిరాంపూర్ కు చెందిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ తనకు పరిచయస్తుడని, అతను మెటా ఫండ్ క్రిప్టో అనే స్కీమ్‌లో పెట్టుబడి పెట్టమని తనను ఆశ చూపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్కీమ్‌లో రూ.50 లక్షలు పెట్టుబడి పెడితే మూడింతలు లాభాలు వస్తాయని సతీష్ నమ్మబలికాడు. సతీష్ మాటలు నమ్మి, భాస్కర్ గత (2024)సంవత్సరం జూన్ నెలలో  రూ.15 లక్షలను సతీష్‌కు ఇచ్చారు. అంతేకాకుండా, మరింత మందిని ఈ పథకంలో చేరిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని సతీష్ చెప్పడంతో, భాస్కర్ తన పరిచయస్తులైన మరో 17 మందిని కూడా ఈ స్కీమ్‌లో చేర్చారు. ఆ 17 మంది ద్వారా గత (2024) సంవత్సరం జూన్ నెలలో సతీష్ మొత్తం ₹1.20 కోట్లు వసూలు చేశాడు. ఈ మొత్తానికి మూడు నెలల్లో మూడింతలు లాభాలు ఇస్తానని వారికి హామీ ఇచ్చాడు. అయితే, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. సతీష్ ను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకుండా బెదిరించాడని బాధితులు ఆరోపించారు. దీనిపై కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రకాష్ గౌడ్, రూరల్ ఎస్‌ఐలు నరేష్, తిరుపతి మరియు సిబ్బందితో కలిసి నిందితుడిని అరెస్ట్ చేశారు. సతీష్ వద్ద నుంచి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, మరియు కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు.
సతీష్‌ను కోర్టుకు, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు. కేసును త్వరగా చేధించి నిందితుడిని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

Tags:

Related Posts