మేటాఫండ్ కేసులో కీలక మలుపు
మెట ఫండ్ కేసులో కీలక మలుపు......!
పోలీసుల అదుపులో కీ పిన్...?
చురకలు ప్రత్యేక కథనం
జగిత్యాల : అక్టోబర్ 10
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన మెట ఫండ్ క్రిప్టో మోసం కేసు కొత్త మలుపు తిరిగింది.
జగిత్యాల జిల్లాలో పోలీసులు చిన్నస్థాయి ఏజెంట్లను మాత్రమే పట్టుకోవడం, కానీ అసలు మాస్టర్ బ్రెయిన్ మాత్రం ఇంకా బయటే తిరుగుతున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండగా గురువారం రాత్రి కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకొన్నట్లు సమాచారం
గోవా ట్రిప్ ఆఫర్ నుంచి మోసం వరకు.!
గత సంవత్సరం ఏప్రిల్‌లో కరీంనగర్ కు చెందిన “భాస్కర్” అనే వ్యక్తి ద్వారా మెట ఫండ్ కంపెనీ జగిత్యాలకు ప్రవేశించింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ ఈ కంపెనీకి స్థానిక లింక్‌గా మారాడు.
తన పరిచయాల ద్వారా ప్రముఖులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు వంటి పలువురిని ఈ స్కీమ్‌లోకి లాగాడు.
“కేవలం ₹90 వేల పెట్టుబడి పెడితే గోవా ట్రిప్!” “₹4.50 లక్షలు కడితే సింగపూర్ టూర్!”
అని ఆకర్షణీయమైన ఆఫర్లతో నమ్మబలికారు.
తరువాత “పెట్టిన డబ్బు మూడు రెట్లు వస్తుంది” అని చెప్పి, చాలామంది అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు.
అయితే చివరికి మూడు రెట్లు కాదు ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదు..!
యం ఎఫ్ పి కాయిన్స్‌తో రెండో దఫా మోసం.!
కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పి పెట్టుబడిదారులకు యం. ఎఫ్. పి కాయిన్స్ ఇస్తామని ప్రకటించింది.
“ఈ కాయిన్స్‌ను కాయిన్‌స్టోర్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు” అని చెప్పి మరొకసారి నమ్మించారు.
కానీ ఆ కాయిన్స్‌కు విలువ లేకపోవడంతో బాధితులు మరోసారి మోసపోయారు.
ప్రముఖులు బాధితులే కానీ మౌనం వహించారు..!
ఈ మోసంలో పెట్టుబడులు పెట్టిన వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, వ్యాపారవేత్తలు ఉండటంతో,
వారిలో చాలా మంది బహిరంగంగా ఫిర్యాదు చేయకుండా మౌనం వహించారు.
అయితే, కొడిమ్యాల గ్రామానికి చెందిన వసంత అనే మహిళ ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో,
పోలీసులు తిరుపతి రెడ్డి, రాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కాగా జగిత్యాల కు చెందిన ఓ ఫోటో గ్రాఫర్ ను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది. అతని నుండి పలు కీలక డాక్యుమెంట్లు స్వాదినం చేసుకొన్నట్ల సమాచారం.
మాస్టర్ బ్రెయిన్ వరాల లోకేష్!
ఇన్వెస్టిగేషన్‌లో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. మెట ఫండ్ కంపెనీ స్థాపకుడు వరాల లోకేష్, హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యక్తి కరీంనగర్ వ్యాపారులతో చేతులు కలిపి వ్యాపారం మొదలుపెట్టాడు. తన ప్రాపర్టీలను మోర్ట్గేజ్ చేశానని చెప్పి నమ్మకాన్ని పొందాడు.
కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు పెట్టుబడులు సేకరించి, కోట్ల రూపాయలతో ఇప్పటికే పరారీలో ఉన్నాడని సమాచారం.
బాధితుల డిమాండ్ పెద్ద చేపలపై చర్యలు తీసుకోండి..!
పోలీసులు చిన్న ఏజెంట్లను అరెస్ట్ చేసినా, అసలు మోసగాళ్లు, ప్లాన్ వేసిన కీలక వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
“మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. మా కష్టార్జిత డబ్బు గాల్లో కలిసిపోయింది,”
అని ఒక బాధితుడు వాపోయాడు.
ఇంకా ఎవరెవరికి తాకుతుందో..?
మెట ఫండ్ మోసం కేసు విచారణ కొనసాగుతోంది. అసలు తిమింగలం ఎవరో బయటపడతాడా..? లేదా ఈ కేసు కూడా ఇతర క్రిప్టో మోసాల్లా మాయమవుతుందా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు జగిత్యాల జిల్లా అంతా చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి జిల్లా కు చెందిన పోలీస్ శాఖ కు చెందిన ఓ ఇన్స్పెక్టర్ స్థాయు అధికారి కూడా ఈ వ్యాపారం లో కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టడమే కాకుండా కొంతమంది డిపాజిటర్ల నుండి డిపాజిట్లు సేకరించగ , డిపాజిట్ల విషయం లో నిలదీయగా స్పందించక పోవడంతో పోలీస్ అధికారులను ఆశ్రయించగా ఉన్నత స్థాయిలో ఈ వ్యవహారం పై విచారిస్తున్నట్లు తెలిసింది.
*క్రిప్టో మోసాల గుట్టు విప్పుతున్న చురకలు — ప్రతి రోజు కొత్త కథనాలు..!*