విప్లవ ఉద్యమ ద్రోహులకు శిక్ష తప్పదు. జగన్
విప్లవ ఉద్యమ నమ్మక ద్రోహుల్లారా.. పిడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదు ... మావొయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్
చురకలు ప్రత్యేక ప్రతినిధి
దేశ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి నమ్మక ద్రోహం మళ్ళొజుల వేణుగోపాల్ రావు, తక్కల పల్లి వాసు దేవారావు మూఠా వల్ల జరిగిందని మావోయస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతి నిధి జగన్ పేరున వచ్చిన ప్రకటన యదవిధిగా పాఠకుల కోసం అందిస్తున్నాం.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ
18.10.2025
విప్లవోద్యమ నమ్మక ద్రోహులారా... పీడిత ప్రజల చేతిలో శిక్ష తప్పదు...
విప్లవ శ్రేణులారా... ప్రజాస్వామ్యవాదులారా... ప్రజలారా...
భారతదేశ యం. ఎల్ పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి తీవ్రమైన నమ్మకద్రోహం మల్లోజుల వేణుగోపాల్ రావు, తక్కల్లపల్లి వాసుదేవరావు ముఠా వలన జరిగినది. ఈ రెండు సంఘటనలు విప్లవోద్యమ పురోగమన చరిత్రలో మాయని మచ్చగా మిగిలి ఉంటాయి. ద్రోహాలు--నమ్మకద్రోహాలు పార్టీకి బయటి నుండి ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా తక్కువ సందర్భాలలో పార్టీలోని శ్రేణులనుండి జరుగుతుంటాయి. పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీ చరిత్రలో కత్తుల సమ్మయ్య లాంటి కొన్ని సంఘటనలు, గోవిందరెడ్డి లాంటి కొన్ని సంఘటనలు జరిగిన విషయం అందరికీ తెలిసినవే. ఈ సంఘటనలకు పాల్పడిన వాళ్ళు DC స్థాయిలో పువాళ్లే.
ఇప్పుడు పార్టీకి, విప్లవోద్యమానికి మరీ ముఖ్యంగా ఆదివాసులకు జరుగుతున్న నష్టానికి కారకులైన నమ్మకద్రోహులు పార్టీలో అగ్రశ్రేణి నాయకులుగా ఉన్నవారు కావడం వలన మనువాద ఫాసిస్ట్ రాజ్యానికి, దోపిడీ వర్గాలకు కొంత ఉపయోగం జరుగుతుంది. ఇది తాత్కాలిక విజయం మాత్రమే అనేది అందరూ గ్రహించాలి.
గత కొంతకాలంగా అతివాద వాగాడంబరం, మితవాద, అవకాశవాద ఆచరణతో అత్యంత గోప్యంగా దోపిడీవర్గాలకు ఉపయోగపడే కార్యాచరణను పార్టీ శ్రేణుల ద్వారా చేయిస్తూ విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం చేసినారు. అనేక కుంటి సాకులతో అతుకని - పొసగని వ్యూహ, ఎత్తుగడలను వల్లిస్తూ విప్లవ శ్రేణుల చైతన్యాన్ని దిగజార్చడానికి అంతుచిక్కని సిద్ధాంతాలు వల్లిస్తూ, నాయకత్వంలో కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టిస్తూ దోపిడీదారుల ఎజెండాను పకడ్బందీగా సాగించారు. పార్టీ నాయకత్వానికి ఎక్కడ అనుమానం రానివ్వకుండా జాగ్రత్తపడుతూ గొప్ప విప్లవకారులుగా ఫోజులు పెడుతూ అనేక నష్టాలకు కారకులయ్యారు.
ఆపరేషన్ కగార్ ప్రారంభం నుండి మొదలైన ఈ కుట్రదారుల కార్యాచరణను పార్టీ తగిన సమయంలో పరిశీలించకపోవడం వలన విప్లవశ్రేణులకు, ఆదివాసులకు, విప్లవ పురోగమనానికి జరిగిన తీవ్రమైన నష్టానికి మావోయిస్టు పార్టీ పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది. పార్టీ సంపదను మనువాద ఫాసిస్ట్ రాజ్యం పాదాల వద్దకు చేర్చిన ఈ నమ్మకద్రోహాన్ని పార్టీ తీవ్రంగా భావిస్తుంది. వీరి మాయ మాటలు నమ్మి క్రమశిక్షణను కలిగిన కొంతమంది ఆదివాసి కామ్రేడ్స్ వీరి వెంట వెళ్ళినారు. మీరంతా వీరి ఉచ్చులో కొనసాగకుండా, ఆదివాసి ప్రాంత ప్రజలకు నష్టం చేయకుండా మీ జీవితాలు కొనసాగించండి. ఆదివాసి ప్రాంతాలలో పెట్టుబడిదారులు గద్దల్లాగా వాలడానికి సిద్ధంగా ఉన్నారు.
అటవీ సంపదను కొల్లగొట్టడానికి అమిత్ షా, మోడీలు పెట్టుబడిదారులకు ఎర్రతివాచీలు పరిచి మోకరిల్లి స్వాగతం పలుకుతున్నారు. మీ కంట్లో మీ వేళ్ళతోనే పొడవడానికి వేణుగోపాల్ రావు, వాసుదేవరావు లాంటి వాళ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోబోతున్నారు. తరతరాలుగా అటవీ సంపదను కాపాడిన మన ముందు తరాల వారి త్యాగాలను కించపరచకుండా, అవమానపరచకుండా భవిష్యత్ తరాల కోసం సంపదను కాపాడుకుందాం.
ప్రజలారా... భారతదేశంలో దోపిడీ, అసమానతలు, వివక్ష, ఆధిపత్యం కొనసాగినంత కాలం అనివార్యంగా ఉద్యమాలు, పోరాటాలు ఉంటాయి. ఏ సిద్ధాంతాలతోటి సంబంధం లేకుండానే సమస్యల ప్రాతిపదికన పోరాటాలు ప్రారంభమవుతాయి. ఇది చారిత్రిక సత్యం. ఈ విధంగా పురుడు పోసుకుంటున్న పోరాటాలను సిద్ధాంతికరిస్తూ కాలమాన పరిస్థితులకు తగినట్టుగా వ్యూహ, ఎత్తుగడలను రూపొందిస్తూ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాలో దోపిడీదారుల నుండి ఈ దేశ ప్రజలను విముక్తి చేయడానికి మావోయిస్టు పార్టీ అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతుంది.
చివరిగా... అమరుల త్యాగాలను కించపరుస్తూ, హేళన చేస్తూ మనువాద ఫాసిస్ట్ పాలకుల అడుగులకు మడుగులోత్తుతూ విప్లవోద్యమ తాత్కాలిక నష్టానికి కారకులైన మల్లోజుల, తక్కల్లపల్లి ముఠాలకు శిక్ష తప్పదని అమరుల త్యాగాల సాక్షిగా శపథం చేస్తున్నాము.
విప్లవాభివందనాలతో....
జగన్
అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్రకమిటీ (మావోయిస్టు)