బాహీరెన్ లో చనిపోయిన ఐదేళ్లకు డేత్ సర్టిఫికెట్ జారీ
బహరేన్ లో చనిపోయిన ఐదేళ్లకు డెత్ సర్టిఫికెట్ జారీ
◉ శ్రీపాద నరేష్ మృతిని ధ్రువీకరించిన ఎంబసీ
◉ చనిపోయి చాలా కాలం అయినందున శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు.
◉ అంత్యక్రియలు బహరేన్ లోనే నిర్వహించాలని సూచించిన ఎంబసీ
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్, 30
గల్ఫ్ దేశమైన బహరేన్ లో చనిపోయిన ఒక తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేసిన అరుదైన సంఘటన జరిగింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్ కు చెందిన శ్రీపాద నరేష్ 2020 మే 28 న బహరేన్ లో సల్మానియా హాస్పిటల్ లో మధ్యాహ్నం 3 గం.లకు మృతి చెందాడు. బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ 2025 అక్టోబర్ 1న డెత్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అక్టోబర్ 30న అధికారికంగా ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.
"సెప్టిక్ షాక్‌తో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, కమ్యూనిటీ అక్వైర్డ్ న్యుమోనియా" కారణంగా మృతి చెందిన శ్రీపాద నరేష్, మృతదేహాన్ని సల్మానియా హాస్పిటల్ మార్గ్యూ (శవాగారం) లో భద్రపరిచినట్లు తెలిపారు. "చనిపోయి చాలా కాలం అయినందున, మృతదేహం రవాణా చేయదగిన స్థితిలో లేదు. కాబట్టి, ఆయన కుటుంబ సభ్యులు బహరేన్ లోనే అంత్యక్రియలు / సమాధి నిర్వహణకు తమ సమ్మతిని తెలియజేయవలసిందిగా కోరనైనది" అని ఎంబసీ తెలియజేసింది.
బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో... శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్ లో మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ నియమిత అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సామాజిక సేవకులు బొక్కెనపల్లి నాగరాజు సహకారంతో, మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ సహాయం కోసం ఈనెల 21న హైదరాబాద్ లో ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నరేష్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నరేష్ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి), పిల్లలు లేక ఒంటరిగా తల్లిదండ్రుల ఊరు కలికోట, కథలాపూర్ మండలంలో కడు పేదరికంలో నివసిస్తున్నారు. ఏనాటికైనా తన భర్త వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదిరిచూస్తోంది, చివరికి ఇప్పుడు శవమై రాబోతున్నాడు. నరేష్ కు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, దత్తత తల్లిదండ్రులూ కూడా చనిపోయారు.
మృతుని సోదరుడు ధర్మపురి ఆనంద్, చిన్నమ్మ తిప్పర్తి పద్మ, సామాజిక సేవకులు మాడిశెట్టి రాకేష్, మొరపు తేజ లు ఈ నెల 28న హైదరాబాద్ లోని సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డి ని కలిసి మృతుడు శ్రీపాద నరేష్ మృత దేశం తరలింపు విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత సచివాలయంలో ఎన్నారై విభాగం జాయింట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి సిహెచ్ శివ లింగయ్యను, సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాస రెడ్డి ని కలిసి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బహరేన్ లోని సామాజిక సేవకులు కోటగిరి నవీన్, డి.వి. శివ కుమార్, నోముల మురళి లు ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బహరేన్ లో నిర్వహించనున్న శ్రీపాద నరేష్ అంత్యక్రియలకు అతని సోదరుడు ధర్మపురి ఆనంద్ హాజరు కావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రవాసీ సంఘాలు సహాయం చేయాలని కోరుతున్నారు.

